Child Sexual Assault On Flight : ముంబై-లండన్ విమానంలో ప్రయాణిస్తున్న 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన భారతీయుడికి యూకే కోర్టు కఠిన శిక్ష విధించింది. ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించేదిలేదని తేల్చి చెప్పింది.
ALSO READ: TTD: తిరుమలలో మహాపచారం.. టీటీడీ సిబ్బంది మాంసాహార భోజనం!
ముంబైకి చెందిన 34 ఏళ్ల షిప్పింగ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ జావేద్ ఇనామ్‌దార్ ముంబై నుంచి లండన్ వెళ్తుండగా 12 ఏళ్ల బాలికపై విమానంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన యూకే కోర్టు నిందితుడికి 21 నెలల కఠిన కారాగార శిక్ష వేసింది. 2024 డిసెంబర్ 14న బ్రిటిష్ ఎయిర్‌వేస్ (BA) విమానంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఐల్స్‌వర్త్ క్రౌన్ కోర్టులో జడ్జి సైమన్ డేవిస్ విచారణలో, జావేద్ ‘భార్య అనుకుని పొరపడ్డాను’ అనే వాదనను తీవ్రంగా ఖండించారు. “ఇది దారుణమైన చర్య. చిన్నారులను ఇలాంటి వారి నుంచి కాపాడటం మన బాధ్యత” అని జడ్జి వ్యాఖ్యానించారు.
ఘటన వివరాలు – జావేద్ విమానంలో అతని పక్క సీట్‌లో నిద్రిస్తున్న బాలిక చేతిని మొదట నిమిరి, తర్వాత ఆమె దుస్తుల్లో చేయి పెట్టాడు. భయంతో బాలిక కేకలు వేస్తూ గట్టిగా ఏడ్చింది. వెంటనే స్పందించిన క్యాబిన్ మేనేజర్ రెబెక్కా రూనీ, బాలికను విచారించగా జరిగినది చెప్పింది. ఆమె మోకాళ్లను చాతీకి అదుముకుని భయంతో వణికిందని రూనీ కోర్టులో సాక్ష్యం చెప్పింది. విమాన సిబ్బంది జావేద్‌ను ప్రశ్నించగా, “భార్య అనుకున్నాను” అని చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. విమానం ల్యాండ్ అయిన తర్వాత మెట్రోపొలిటన్ పోలీసులకు సమాచారం అందించగా వాళ్లు అతన్ని అరెస్టు చేశారు.
విచారణలో జావేద్ తరఫు న్యాయవాది, “భార్య అనుకొని పొరపాటు పడ్డాడు. శిక్ష తగ్గించండి” అని వాదించాడు. కానీ జడ్జి డేవిస్ వాదనలను తిరస్కరించారు. “భార్య అనుకోవడం నమ్మశక్యం కాదు. బాలిక భయంతో కేకలు వేస్తోందని తెలిసి కూడా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చిన్నారుల భద్రత ముఖ్యం.. వారిని ఇలాంటి వారి నుంచి కాపాడాలి” అంటూ అతని వాదనను ఖండించారు. విచారణ సమయంలో జావేద్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఈ కేసు విమానాల్లో చిన్నారుల భద్రతపై చర్చను రేకెత్తించింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్ CEO షాన్ డాగ్లస్, “ప్రయాణికుల భద్రత మా ప్రాధాన్యత. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాము” అని ప్రకటించారు. యూకేలో 2024లో విమానాల్లో 50కి పైగా లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో కూడా విమానాల్లో ఇలాంటి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.


