Man Kills Wife For Rs 30 Lakh Insurance: జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రూ. 30 లక్షల బీమా (Insurance) డబ్బుల కోసం ఒక కిరాతకుడు నాలుగు నెలల క్రితం పెళ్లయిన భార్యను హత్య చేశాడు. దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించి, చివరకు పోలీసులకు దొరికిపోయాడు.
పద్మ అవుట్ పోస్ట్ (OP) ఇన్‌ఛార్జ్, సంచిత్ కుమార్ దూబే తెలిపిన వివరాల ప్రకారం, ముఖేష్ కుమార్ మెహతా (30) తన భార్య సేవంతి కుమారి (23) ను అక్టోబర్ 9వ తేదీ రాత్రి హత్య చేశాడు.
యాక్సిడెంట్‌గా నమ్మించే ప్రయత్నం
అక్టోబర్ 9న రాత్రి NH-33లోని పద్మ-ఇట్ఖోరి మార్గంలో ఒక జంట రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లుగా పడి ఉన్నారని స్థానికుల నుంచి తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మరణించిన సేవంతి కుమారిని, స్పృహ కోల్పోయినట్లు నటించిన ఆమె భర్త ముఖేష్‌ను ఆసుపత్రికి తరలించారు. భార్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపగా, స్వల్ప గాయాలైన భర్తకు చికిత్స అందించారు.
అయితే, భార్య అంత్యక్రియల సమయంలో భర్త ముఖేష్ ప్రవర్తనపై స్థానికులకు అనుమానం వచ్చింది. “స్థానికుల ఫిర్యాదుల మేరకు దర్యాప్తు ప్రారంభించగా, ముఖేష్ రూ.30 లక్షల ప్రమాద బీమా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది. దీంతో మా అనుమానం మరింత బలపడింది,” అని పోలీసు అధికారి తెలిపారు.
విచారణలో బయటపడ్డ నిజాలు
ముఖేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అసలు విషయం బయటపడింది. బీమా డబ్బుల కోసమే తాను ఈ నేరం చేసినట్లు ముఖేష్ అంగీకరించాడు. అక్టోబర్ 9వ తేదీ రాత్రి కడుపు నొప్పికి చికిత్స చేయిస్తానని చెప్పి భార్యను తీసుకెళ్లి, హెల్మెట్‌తో కొట్టి, ఆపై గొంతు నులిమి చంపినట్లు తెలిపాడు.
హత్య తర్వాత, రోడ్డు ప్రమాదంగా కనిపించేలా బైక్‌కు, తన శరీరానికి స్వల్ప గాయాలు చేసుకుని, మృతదేహాన్ని రోడ్డుపై పడుకోబెట్టినట్లు నిందితుడు వివరించాడు. బైక్‌కు కానీ, అతనికి కానీ రోడ్డు ప్రమాదం జరిగినంత తీవ్రమైన గాయాలు లేవని గుర్తించిన పోలీసులు, ముఖేష్‌ను సోమవారం సాయంత్రం అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
ALSO READ: Wife Shot Dead: పాస్‌పోర్ట్ విషయంలో గొడవ.. కూతురి కళ్ల ముందే భార్యను కాల్చి చంపిన భర్త


