Kanada TV Actress: ఇటీవల కాలంలో భార్యలను భర్తలు చంపడం.. భర్తలను భార్యలను చంపడం సర్వసాధారణం అయిపోతుంది. అనుమానం, వివాహేతర సంబంధాలు, వరకట్నం వేధింపులు కారణం ఏదైనా మూడు ముళ్లు వేసి కలకాలం తోడుంటామని చేసిన ప్రమాణాలు మర్చిపోతున్నారు. తమ సంతోషమే ముఖ్యమనుకుని కట్టుకున్న వాళ్లని నిర్దాక్షిణ్యంగా కడతేరుస్తున్నారు. తాజాగా ఇలాంటి దారుణ ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. సీరియల్ నటిపై హత్యాయత్నం జరిగింది. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్న భర్తే ఆమెను కత్తతో పొడిచి పరారయ్యాడు. ఈ ఘటన బెంగళూరు నగరంలో కలకలం రేపింది.
అసలు ఏం జరిగిందంటే.. ముంజుల అలియాస్ శ్రుతి(49) అనే యువతి కన్నడ సీరియల్‌లో నటిస్తోంది. 20 ఏళ్ల క్రితం అమరేశ్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు(కుమార్తెలు) ఉన్నారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. వరకట్నం కోసం తనను తీవ్రంగా వేధిస్తున్నాడని మూడు నెలల కింద ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై గృహహింస కేసు నమోదు చేశారు పోలీసులు.
అప్పటి నుంచి ఆమె విడిగా తన సోదరుడి ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలోనే తాను మారిపోయానని.. ఇద్దరం కలిసి ఉందామని అమరేశ్ ఆమెను నమ్మించి తన ఇంటికి తీసుకువెళ్లాడు. పాత కక్షలు మనసులో పెట్టుకున్న అమరేశ్.. జులై 4వ తేదీన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె కంటిపై పెప్పర్ స్ప్రే చల్లి కత్తితో ఆమెపై దాడి చేశాడు. గట్టిగా కేకలు వేయడంతో పక్కింటి వారు వచ్చి ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అమరేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం శ్రుతి విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
శ్రుతి ఫిర్యాదు మేరకు అమరేశ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కన్నడ సీరియల్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే చంపేందుకు ప్రయత్నించడం తీవ్ర చర్చనీయాంశంమైంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బుల్లితెర వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.


