Kanpur crime case: స్నేహం ముసుగులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. “గణేష్ మండపానికి వెళ్దాం రా” అని పిలిచిన స్నేహితులే, యమపాశమై ప్రాణాలు తీశారు. చెల్లితో ప్రేమగా ఉంటున్నాడనే అనుమానంతో స్నేహితుడిని నమ్మించి తీసుకెళ్లి, అత్యంత కిరాతకంగా తల నరికి, శరీరాన్ని ముక్కలు చేసి, గంగా నదిలో పారేసిన ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగు చూసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
“గణేష్ మండపానికి” అని తీసుకెళ్లి..:
కాన్పూర్‌లోని చకేరి ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల రిషికేశ్, ఆగస్టు 29 సాయంత్రం తన స్నేహితులు మోగ్లి, నిఖిల్‌లతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. “గణేష్ మండపానికి తీసుకెళ్తున్నాం” అని అతని కుటుంబ సభ్యులకు చెప్పడంతో, వారు కూడా అనుమానించలేదు. కానీ, ఇది ఒక పక్కా ప్రణాళికతో కూడిన హత్యకు తొలి అడుగు అని వారికి తెలియదు.
పక్కా ప్లాన్‌తో కిరాతకం:
కుటుంబ సభ్యులకు చెప్పకుండానే, అప్పటికే పథకం ప్రకారం మండపం వద్ద ప్రధాన నిందితుడు పవన్ మల్లా, అతని అనుచరులు బాబీ, డానీ, సత్యం, రిషు, ఆకాష్‌లు వేచి ఉన్నారు. వారంతా కలిసి రిషికేశ్‌ను బలవంతంగా మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని, నగరం శివార్లలోని నిర్మానుష్య ప్రాంతమైన కాకోరి అడవిలోకి తీసుకెళ్లారు.
అడవిలో అమానుషం:
కాకోరి అడవిలో, స్నేహితులే రాక్షసులుగా మారారు. రిషికేశ్‌ను తాడుతో కట్టేసి, కాళ్లు చేతులు కదలకుండా చేసి, కత్తితో గొంతు కోసి కిరాతకంగా చంపేశారు.
గుర్తుపట్టకుండా.. తల నరికి: హత్య తర్వాత, మృతదేహం గుర్తుపట్టకుండా ఉండటానికి, తల నరికి మొండెం నుంచి వేరు చేశారు. ముందుగానే తెచ్చుకున్న సంచిలో తలను, మిగతా శరీర భాగాలను వేర్వేరుగా కుక్కారు.
గంగలో పారవేత: ఆ తర్వాత, ఓ ఇ-రిక్షాను మాట్లాడుకుని, జాజ్మౌ వంతెన వద్దకు చేరుకున్నారు. అక్కడ తలను ఒకవైపు, మొండాన్ని మరోవైపు, ఇతర శరీర భాగాలను వేర్వేరు దిశల్లో గంగా నదిలో పడేశారు.
అనుమానంతోనే ఈ ఘాతుకం: ప్రధాన నిందితుడు పవన్ మల్లా, మృతుడు రిషికేశ్‌కు స్నేహితుడు. తన చెల్లితో రిషికేశ్ సన్నిహితంగా ఉంటున్నాడని, వారి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని పవన్ అనుమానించాడు. ఇదే ఈ ఘోరమైన పరువు హత్యకు దారితీసిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
పచ్చబొట్టు పట్టించింది: రిషికేశ్ కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో, మహారాజ్‌పూర్ ప్రాంతంలో గంగా నది ఒడ్డున తల లేని మొండెం లభ్యమవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రిషికేశ్ కుటుంబ సభ్యులను పిలిపించగా, మృతుడి కుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు, మణికట్టుకు కట్టిన పవిత్ర దారం ఆధారంగా అది రిషికేశ్ మృతదేహమేనని గుర్తించారు. ఈ కిరాతక హత్యకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు పవన్ మల్లాతో సహా మరో నలుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


