Wednesday, July 3, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: శ్రీ చైతన్య కాలేజ్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్

Karimnagar: శ్రీ చైతన్య కాలేజ్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్

కొంత మంది స్టూడెంట్స్ పరిస్థితి విషమం

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య కళాశాల వసతి గృహంలో ఆదివారం ఉదయం ఫుడ్ పాయిజన్ కావడంతో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ నిర్వాహకులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యార్థులను చేర్పించి వైద్యం అందించారు. ప్రైవేట్ కళాశాలలో నాణ్యమైన విద్య అందిస్తారని ఎంతో నమ్మకంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం లక్షలు వెచ్చిస్తూ ప్రైవేట్ హాస్టల్లో చేర్పించడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతుంది. కానీ హాస్టల్లో సౌకర్యాలపై దృష్టి సారించకపోవడంతో కళాశాలల యాజమాన్యం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు వసతి గృహాలపై పర్యవేక్షణ చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

- Advertisement -

లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కళాశాల యాజమాన్యాలు అదే స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించకపోవడంపై విద్యార్థి సంఘాల నాయకులు సైతం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడం చూస్తుంటే ప్రైవేట్ వసతి గృహాలలో విద్యార్థులకు ఎలాంటి భోజన వసతి కల్పిస్తున్నారో అర్థమవుతుంది.

ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను పరామర్శించిన విద్యార్థి యువజన నాయకులు కరీంనగర్ నగరంలోని శ్రీ చైతన్య కళాశాల హాస్టల్లో విద్యార్థులు తిన్న టిఫిన్ ఫుడ్ పాయిజన్ కావడం వల్ల విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురికాగా సదరు విద్యార్థులను రాఘవేంద్ర హాస్పిటల్ లో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బోనగిరి మహేందర్ ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్, నగర కార్యదర్శి చెంచల మురళి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు తిప్పార పురోహిత్ నగర కార్యదర్శి వినయ్ సాగర్ ఎం ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు చెంచల నవీన్, ఏఐఎస్ఎఫ్ నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి,వినయ్ పరామర్శించారు.

అనంతరం శ్రీ చైతన్య కళాశాల యజమాన్య మొండి వైఖరిని నిరసిస్తూ కళాశాల ముందు విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి, యువజన నాయకులు మాట్లాడుతూ… కరీంనగర్ నగరంలో విచ్చలవిడిగా ప్రైవేట్ హాస్టల్లు నెలకొన్నాయని వీటిని పర్యవేక్షించే అధికారులే లేకపోవడం వల్ల ఇష్టానుసారం నిర్వహిస్తున్నారని ఎవరు కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని శ్రీ చైతన్య కాలేజీలో ఆదివారం జరిగిన సంఘటన దీనికి ఉదాహరణ అని వారు ఆరోపించారు. లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేట్ కళాశాలలో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వీరిని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థులకు రోజు ఇచ్చే ఆహారం నాణ్యత లోపిస్తుందని నాణ్యత ప్రమాణాలు పాటించని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. కనీసం నెలకు ఒకసారి అయినా ఫుడ్ అధికారులు, మున్సిపల్ అధికారులు వసతి గృహాలను సందర్శిస్తే వీరు ఇచ్చే ఆహారం ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుందన్నారు. ఇష్టారాజ్యంగా ప్రైవేట్ కళాశాలల హాస్టల్లో రాత్రి మిగిలిన అన్నoన్ని కిచిడి గా మార్చుతున్నారని పరిశుభ్రత పాటించకుండా నాణ్యత లేని నిత్యవసర వస్తువులను నాసిరకం వాడుతున్నారని దీంతో విద్యార్థులు అస్వస్థతకు జరిగిందని అన్నారు.
ఇంత జరిగినా కానీ శ్రీ చైతన్యకళాశాల చైర్మన్ అస్వస్థకు గురైన విద్యార్థులను సందర్శించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి కిందిస్థాయి అధికారులకు ఆదేశించి ప్రతి హాస్టల్లో తనిఖీ చేయాలని వారు డిమాండ్ చేశారు.


అస్వస్థకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. లేని పక్షంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News