ఆకస్మిక గుండెపోట్లతో ఈ మధ్య సంభవిస్తున్న మరణాలను తగ్గించేందుకు సిపిఆర్ (హృదయ శ్వాసకోశ పురర్జీవనచర్య) శిక్షణలు దోహదపడుతాయని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. ఆకస్మిక గుండెపోట్ల నుండి ప్రజలను రక్షించేందుకు అన్నిస్థాయిలకు చెందిన పోలీసులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.
కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలో మెడికవర్ ఆసుపత్రి వారి సహకారంతో బుధవారం ట్రాఫిక్ పోలీసులకు సిపిఆర్ (హృదయ శ్వాసకోశ పురర్జీవనచర్య) శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ ఆకస్మిక గుండెపోట్లు సంభవించిన సందర్భాల్లో సిపిఆర్ విధానం ద్వారా గుండెకు రక్తప్రసరణం అందడం, నోటిద్వారా ఆక్సిజన్ అందించడం వల్ల గుండె పనిచేయడం ప్రారంభించి ప్రమాదానికి గురైనవారిని రక్షించవచ్చని తెలిపారు. నిత్యం ప్రజల మధ్యఉండే పోలీసులకు ఆకస్మిక గుండెపోట్లు సంభవించిన వ్యక్తులు తారసపడే అవకాశం ఉన్నదందున, అన్నిస్థాయిలకు చెందిన పోలీసులు పూర్తిస్థాయిలో శిక్షణ పొందినట్లయితే అలాంటి వ్యక్తుల ప్రాణాలను రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.
వైద్యులు అక్షయ్, హర్షితలు సిపిఆర్ విధానంపై శిక్షణ ఇచ్చారు. అనంతరం వైద్యులు పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడుతోపాటు ఉన్నతాధికారులు, అన్నిస్థాయిలకు చెందిన పోలీసులతో సిపిఆర్ విధానాన్ని చేయించారు.
