Friday, January 16, 2026
Homeనేరాలు-ఘోరాలుKhammam: "అమ్మా.. గుడ్ మార్నింగ్.. లే అమ్మా": మిన్నంటిన అనాథ పిల్లల రోదనలు!

Khammam: “అమ్మా.. గుడ్ మార్నింగ్.. లే అమ్మా”: మిన్నంటిన అనాథ పిల్లల రోదనలు!

Heart attack: యూనిఫాం వేసుకున్నది కేవలం విధి నిర్వహణకే కాదు.. వందలాది మంది అనాథల జీవితాల్లో వెలుగులు నింపడానికని నిరూపించారామె. కన్నవారు ఎవరో తెలియక.. ఉన్నవారు దగ్గరకు రాక అల్లాడుతున్న పసిప్రాణాలకు తనే ఒడి అయ్యారు. ఆకలి తీర్చే అన్నపూర్ణగా, భవిష్యత్తునిచ్చే మార్గదర్శిగా నిలిచిన ఖమ్మం జిల్లా సీసీఎస్ పోలీస్ స్టేషన్ హోంగార్డు ఏనుగుల మంజుల (47) గురువారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.

- Advertisement -

నిద్రలోనే అనంత లోకాలకు: గురువారం సాయంత్రం తన విధి నిర్వహణ ముగించుకుని మంజుల.. తాను ఏర్పాటు చేసిన అమ్మ అనాథ శరణాలయంకు చేరుకున్నారు. ఎప్పటిలాగే ఆశ్రమంలోని పిల్లలతో సరదాగా ముచ్చటించారు. వారితో కొంత సమయం గడిపిన అనంతరం హాల్‌లోనే నిద్రపోయారు. అయితే ఆ నిద్రే ఆమెను శాశ్వతంగా దూరం చేస్తుందని అక్కడి చిన్నారులు ఊహించలేకపోయారు.

Also read-Suicide: విషాదం.. 11 నెలల కుమారుడికి విషమిచ్చి.. తల్లి ఆత్మహత్య!

అమ్మా లే.. అంటూ పసిపిల్లల రోదన: శుక్రవారం ఉదయం పిల్లలందరూ హోంగార్డు మంజుల వద్దకు వెళ్లి “అమ్మా.. గుడ్ మార్నింగ్.. లే అమ్మా..”అంటూ పిలిచారు. ఎంత పిలిచినా ఆమె పలకకపోవడంతో పిల్లలు ఆందోళన చెందారు. వెంటనే ఆమె కుమార్తెకు సమాచారం అందించారు. దీంతో ఆమె వైద్యుడిని పిలిపించారు. పరిశీలించిన డాక్టర్ మంజుల గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు. తమను కంటికి రెప్పలా కాపాడిన అమ్మ విగతజీవిగా పడి ఉండటంతో చిన్నారుల రోదనలు మిన్నంటాయి. “అమ్మా.. మాకు ఇక దిక్కెవరు?” అంటూ వారు ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.

పోలీస్ శాఖ నివాళులు: మంజుల మృతికి పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, తోటి సిబ్బంది ఘన నివాళులర్పించారు. ఆమె సేవలను కొనియాడారు. అనంతరం ఐసీడీఎస్ అధికారులు ఆశ్రమంలోని పిల్లల బాధ్యతను స్వీకరించి.. వారిని ప్రభుత్వ బాలల సదనానికి తరలించారు. ఒక సాధారణ హోంగార్డుగా ఉంటూ వందలాది అనాథలకు ప్రాణం పోసిన హోంగార్డు మంజుల మరణం ఖమ్మం జిల్లాలో తీరని లోటుగా మిగిలిపోయింది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News