కర్నూలు ప్రమాద కేసులో ఏ1గా ఉన్న డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. 19 మంది సజీవ దహనానికి కారణమైన ఏ1 నిందితుడు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య ఏ2 నిందితుడైన బస్సు యజమాని కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టగా.. మంళవారం అర్ధ్రరాత్రి డ్రైవర్ లక్ష్మయ్యను అరెస్ట్ చేశారు.
అర్హత లేకున్నాహెవీ డ్రైవింగ్ లైసెన్స్: కర్నూలు ప్రమాద కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఒక్కోవిషయం బయటకు వస్తుంది. అరెస్ట్ అయిన డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యకు అర్హత లేకున్నప్పటికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. లక్ష్మయ్య కేవలం 5వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ.. టెన్త్ ఫెయిల్ అయినట్లు నకిలీ సర్టిఫికెట్ సమర్పించి ఈ లైసెన్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని పూర్వ చరిత్రను పరిశీలించగా.. మొదట లారీ క్లీనర్‌గా ఆ తర్వాత డ్రైవర్‌గా పనిచేశాడు.2004లో లారీ డ్రైవర్‌గా ఉన్నప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టును ఢీకొట్టడంతో అప్పట్లో లారీ క్లీనర్ మృతి చెందినట్టుగా పోలీసుల విచారణలో బయటపడింది. ఈ సంఘటన తర్వాత కొన్నాళ్లు లారీ డ్రైవింగ్ మానేసి స్వగ్రామంలో వ్యవసాయం చేశాడని పోలీసులు గుర్తించారు. అయితే గత ఏడెనిమిదేళ్లుగా మళ్లీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. లక్ష్మయ్యకు అప్పుడప్పుడు మద్యం సేవించే అలవాటు సైతం ఉందని సమాచారం. లక్ష్మయ్య లైసెన్స్ జారీ వెనుక ఉన్న అంశాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. బస్సు యజమానిని అరెస్టు చేసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
విచారణలో విస్తుపోయే నిజాలు: ద్విచక్ర వాహనాన్ని కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టకముందే బైక్ పై వెళ్తున్న శివశంకర్ మరణించినట్టు పోలీసుల నిర్ధారణలో తెలిసింది. మద్యం మత్తులో శివశంకర్ తోపాటుగా ఎర్రిస్వామి ద్విచక్ర వహనంపై అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో లక్ష్మీపురం గ్రామం నుంచి బయలు దేరారు. ఎర్రిస్వామిని తుగ్గలి వద్ద డ్రాప్ చేయడానికి శివశంకర్ ఆయనను తన బైక్‌పై తీసుకెళ్లారు. మార్గమధ్యలో కియా షోరూం సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద అర్ధరాత్రి 2.24 గంటలకు పెట్రోల్ పోయించుకున్నారు. ఆ సమయంలో భారీ వర్షం పడుతుంది. అయినా లెక్కచేయకుండా.. బైక్‌పై వెళుతున్న శంకర్, ఎర్రిస్వామి మద్యం మత్తులో ఉండగా చిన్నటేకూరు దగ్గర బైక్ స్కిడ్ అయ్యి కిందపడ్డారని ప్రాథమికంగా తేలింది. ఈ ప్రమాదంలో శివశంకర్ రోడ్డు మధ్యలో బైక్‌తో పాటు పడిపోయాడని ఎర్రిస్వామి పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. శంకర్‌తో పాటుగా రోడ్డుకు ఇరువైపుల పడిపోయినట్టుగా ఎర్రిస్వామి వెల్లడించాడు.
Also Read:https://teluguprabha.net/crime-news/private-bus-fire-accident-in-rajasthan-jaipur-delhi-highway/
ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొట్టడంతో శంకర్ తలకు బలమైన గాయాలు అయ్యాయని తెలుస్తోంది. దీంతో స్పాట్‌లోనే మృతి చెందినట్లు తేలింది. ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎర్రిస్వామి భయంతో పారిపోయినట్టుగా పోలీసుల విచారణలో తేటతెల్లం అయ్యింది. కిందపడిన బైక్ పై నుంచి కొద్దిసేపటి తర్వాత వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు వెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సుమారు 300 మీటర్ల వరకూ బైక్‌ను బస్సు ఈడ్చుకెళ్లిందని పోలీసులు నిర్ధారించారు. అయితే పోలీసుల నిర్ధారణలో మరో విషయం బయటపడింది. ప్రమాదానికి గురైన బస్సు కంటే ముందు.. మరో 3బస్సులు ఆ రోడ్డుపై పడిపోయిన బైకును చూసి పక్క నుంచి వెళ్లాయి. కానీ ఆ ద్విచక్ర వాహనం ను రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం చేయలేదు. అలా చేసి ఉంటే ఈ ఘోర ప్రమాదం తప్పేదని విచారణలో బట్టబయలు అయ్యింది.


