Kurnool bus accident fire : గాఢ నిద్రలో ఉన్న ఆ ప్రయాణికులకు తెలియదు, తాము ప్రయాణిస్తున్నది గమ్యస్థానానికి కాదని, మృత్యుఒడిలోకి అని. జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు అగ్నిగోళంగా మారి, 20 మందికి పైగా ప్రయాణికులను సజీవ దహనం చేసిన ఘోర విషాదం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో, నిద్రలోనే అనేకమంది అగ్నికి ఆహుతయ్యారు. అసలు ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగింది..? నిద్రలోనే అంతమంది ప్రాణాలు గాలిలో కలవడానికి కారణమేంటి..?
పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘోర దుర్ఘటన జరిగింది.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు: హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చెందిన ‘వేమూరి కావేరి ట్రావెల్స్’కు చెందిన వోల్వో బస్సు, (నెంబర్ DD 01 N 9490) సుమారు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. కర్నూలు జిల్లా సమీపంలోకి రాగానే, జాతీయ రహదారిపై బస్సు ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగి, క్షణాల్లోనే బస్సు మొత్తం అగ్నిగోళంగా మారింది.
నిద్రలోనే సజీవ దహనం : ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికుల్లో అధిక శాతం గాఢ నిద్రలో ఉన్నారు. అప్రమత్తమైన ఇద్దరు డ్రైవర్లు, మరో 12 మంది ప్రయాణికులు బస్సు కిటికీల అద్దాలు పగులగొట్టుకుని, ప్రాణాలతో బయటపడ్డారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి.
20 మందికి పైగా బలి: మిగిలిన ప్రయాణికులు, మంటలు వేగంగా వ్యాపించడంతో, బస్సులోనే చిక్కుకుపోయి, నిద్రలోనే సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య 20కి పైగానే ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాద తీవ్రతకు బస్సు పూర్తిగా కాలి బూడిదై, కేవలం అస్థిపంజరంలా మిగిలింది. ఘటనా స్థలంలోని దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి.
బస్సు ప్రయాణికుల జాబితా :
అశ్విన్‌రెడ్డి (36), జి.ధాత్రి (27), కీర్తి (30)
పంకజ్(28), యువన్ శంకర్‌రాజు(22)
తరుణ్(27), ఆకాశ్(31), గిరిరావు(48)
బున సాయి(33), గణేశ్(30), జయంత్ పుష్వాహా(27)
పిల్వామిన్ బేబి(64), కిశోర్ కుమార్(41)
రమేష్, అతని ముగ్గురు కుటుంబ సభ్యులు
రమేష్(30), అనూష(22), మహ్మద్ ఖైజర్(51), దీపక్ కుమార్ 24
అన్డోజ్ నవీన్‌కుమార్(26), ప్రశాంత్(32)
ఎం.సత్యనారాయణ(28), మేఘనాథ్(25)
వేణు గుండ(33), చరిత్(21), చందన మంగ(23)
సంధ్యారాణి మంగ(43), గ్లోరియా ఎల్లెస శ్యామ్(28)
సూర్య(24). హారిక(30), శ్రీహర్ష(24)
శివ(24), శ్రీనివాసరెడ్డి(40), సుబ్రహ్మణ్యం(26)
కె.అశోక్(27), ఎం.జి.రామారెడ్డి(50)
ఉమాపతి(32), అమృత్ కుమార్(18), వేణుగోపాల్‌రెడ్డి(24)
ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారు వీరే :
నవీన్ కుమార్
వేణుగోపాల్ రెడ్డి
సత్యనారాయణ
రామిరెడ్డి
సుబ్రహ్మణ్యం
జష్మిత
శ్రీలక్ష్మి
అఖిల్
రమేష్
అకీర
జయసూర్య
స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి : ఈ ఘోర ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వెంటనే ఏపీ సీఎస్, డీజీపీలతో ఫోన్‌లో మాట్లాడి, ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్తున్న బస్సు కావడంతో, బాధితుల్లో తెలంగాణకు చెందిన వారు ఉండే అవకాశం ఉందని, వారికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, తక్షణమే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు.
పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను వెలికితీసి, గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో, వారిని గుర్తించడం పోలీసులకు పెను సవాల్‌గా మారింది. ప్రభుత్వం నుంచి మృతుల వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


