kurnool bus accident updates: కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. విచారణలో విస్తుపోయే నిజాలుల ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. ప్రమాదానికి గురైన బస్సు కంటే ముందు.. మరో మూడు బస్సులు ఆ రోడ్డుపై పడిపోయిన బైకును చూసి పక్క నుంచి వెళ్లాయి. కానీ ఆ ద్విచక్ర వాహనం ను రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం చేయలేదు. అలా చేసి ఉంటే ఈ ఘోర ప్రమాదం తప్పేదని విచారణలో బట్టబయలు అయ్యింది. 19 మంది ప్రాణాలు దక్కేవని తేలింది.
విచారణలో విస్తుపోయే నిజాలు: ద్విచక్ర వాహనాన్ని కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టకముందే బైక్ పై వెళ్తున్న శివశంకర్ మరణించినట్టు పోలీసుల నిర్ధారణలో తెలిసింది. మద్యం మత్తులో శివశంకర్ తోపాటుగా ఎర్రిస్వామి ద్విచక్ర వహనంపై అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో లక్ష్మీపురం గ్రామం నుంచి బయలు దేరారు. ఎర్రిస్వామిని తుగ్గలి వద్ద డ్రాప్ చేయడానికి శివశంకర్ ఆయనను తన బైక్‌పై తీసుకెళ్లారు. మార్గమధ్యలో కియా షోరూం సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద అర్ధరాత్రి 2.24 గంటలకు పెట్రోల్ పోయించుకున్నారు. ఆ సమయంలో భారీ వర్షం పడుతుంది. అయినా లెక్కచేయకుండా.. బైక్‌పై వెళుతున్న శంకర్, ఎర్రిస్వామి మద్యం మత్తులో ఉండగా చిన్నటేకూరు దగ్గర బైక్ స్కిడ్ అయ్యి కిందపడ్డారని ప్రాథమికంగా తేలింది. ఈ ప్రమాదంలో శివశంకర్ రోడ్డు మధ్యలో బైక్‌తో పాటు పడిపోయాడని ఎర్రిస్వామి పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. శంకర్‌తో పాటుగా రోడ్డుకు ఇరువైపుల పడిపోయినట్టుగా ఎర్రిస్వామి వెల్లడించాడు.
Also Read: https://teluguprabha.net/crime-news/latest-updates-in-kurnool-bus-accident/
ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొట్టడంతో శంకర్ తలకు బలమైన గాయాలు అయ్యాయని తెలుస్తోంది. దీంతో స్పాట్‌లోనే మృతి చెందినట్లు తేలింది. ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎర్రిస్వామి భయంతో పారిపోయినట్టుగా పోలీసుల విచారణలో తేటతెల్లం అయ్యింది. కిందపడిన బైక్ పై నుంచి కొద్దిసేపటి తర్వాత వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు వెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సుమారు 300 మీటర్ల వరకూ బైక్‌ను బస్సు ఈడ్చుకెళ్లిందని పోలీసులు నిర్ధారించారు. అయితే పోలీసుల నిర్ధారణలో మరో విషయం బయటపడింది. ప్రమాదానికి గురైన బస్సు కంటే ముందు.. మరో 3బస్సులు ఆ రోడ్డుపై పడిపోయిన బైకును చూసి పక్క నుంచి వెళ్లాయి. కానీ ఆ ద్విచక్ర వాహనం ను రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం చేయలేదు. అలా చేసి ఉంటే ఈ ఘోర ప్రమాదం తప్పేదని విచారణలో బట్టబయలు అయ్యింది.


