ఆకాంక్ష దుబే అనే నటి ఆత్మహత్య గుర్తుందికదా.. కొద్దిరోజుల క్రితమే ఆమె షూటింగ్ ముగించుకుని ఆతరువాత ఆత్మహత్య చేసుకున్న కేసు అనుమానాస్పద కేసుగా నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా భోజ్‌పురి ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు నిందితులు సమర్ సింగ్, సంజయ్ సింగ్ పై లుకౌట్ నోటీసులు జారీచేశారు. అన్ని ఎయిర్ పోర్టులకు కూడా ఈ నోటీసులు జారీ చేశారు.
భోజ్‌పుర్ భాషలో గాయకుడిగా పాపులర్ అయిన సమర్ సింగ్ తో కలిసి నటి ఆకాంక్ష సింగ్ మ్యూజిక్ వీడియోలు కూడా చేశారు. అయితే వీరిమధ్య ఏవో విభేదాలు తలెత్తి ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డట్టు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సమర్ పరారీలో ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆకాంక్ష తల్లి మాత్రం తన కుమార్తెను హత్య చేశారని, ఈ కేసు విచారణను సీబీసీఐడికి అప్పగించాలని డిమాండ్ చేస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు లేఖ రాశారు. మార్చ్ 26వ తేదీని ఆకాంక్ష మరణించగా పోస్ట్ మార్టం రిపోర్టు రాకముందే ఆమె అంత్యక్రియలు జరిపించారని తల్లి వాపోతున్నారు. 25 ఏళ్ల హీరోయిన్ ఆకాంక్ష ఇండస్ట్రీలో ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నారంటూ ఆమె తరపు లాయర్ వాదిస్తున్నారు.