Lovers suicide: వైఎస్ఆర్ కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడు తనువు చాలించాడన్న వార్త తట్టుకోలేక ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. కేవలం 19 ఏళ్ల వయసున్న ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే: పోలీసుల కథనం ప్రకారం.. చెన్నూరుకు చెందిన యోగింద్ర కుమార్ వర్మ (19), కడప నగరంలోని గోదిన వీధికి చెందిన హేమశ్రీ (19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ కడపలోని ఒక ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య వ్యక్తిగత కారణాలతో మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది.
Also read-Breaking: శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్!
ప్రియుడి చావు వార్తను తట్టుకోలేక యువతి ఆత్మహత్య: మనస్తాపానికి గురైన యోగింద్ర కుమార్, కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మృత్యుంజయ కుంటలో ఉన్న తన బంధువుల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రియుడు మరణించాడన్న వార్త తెలిసిన హేమశ్రీ తీవ్ర మనోవేదనకు లోనైంది. యోగింద్ర మరణాన్ని తట్టుకోలేక సోమవారం ఉదయం చెన్నూరులోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

