జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబడి పల్లికి చెందిన బిగ్ బాస్ అభ్యర్థి, మై విలేజ్ షో ద్వారా గుర్తింపు పొందిన గంగవ్వ యూట్యూబ్ ఛానల్ కోసం తీసిన చిలుక జోష్యం వీడియో సమస్య తెచ్చి పెట్టింది. యూట్యూబ్ ప్రయోజనాల కోసం, ధనార్జనే ముఖ్య లక్ష్యంగా వన్యప్రాణి అయినటువంటి చిలుకను హింసించినట్లు వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించిందని వచ్చిన ఫిర్యాదు మేరకు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్ ఆర్ ఓ పద్మారావు తెలిపారు.
గంగవ్వతో పాటు మై విలేజ్ షో యూట్యూబర్ రాజుపై కూడా ఈ కేసు రిజిస్టర్ అయినట్లు అధికారులు తెలిపారు. 2022 సంవత్సరం మే నెలలో తీసిన ఈ వీడియోపై జంతు సంరక్షణ కార్యకర్త ఆదిలాపురం గౌతమ్ అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.