Man Beaten To Death By Wife’s Father: మధ్యప్రదేశ్‌లో పరువు హత్యకు సంబంధించిన ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని, అతని అత్తింటివారు, వారి బంధువులు కలిసి కర్రలతో కొట్టి చంపేశారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆ యువకుడు దాదాపు వారం రోజుల పాటు చావుతో పోరాడి ప్రాణాలు విడిచాడు.
ఈ ఘటన బెల్‌ఘర్‌హా పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్సీ గ్రామంలో జరిగింది. మృతుడు ఓంప్రకాష్ బతం అదే గ్రామానికి చెందిన శివాని ఝాను ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కుటుంబాలకు దూరంగా ఉన్న ఈ జంట ఆగస్టు 19న తమ స్వగ్రామానికి తిరిగి వచ్చారు. అదే అతనికి చివరి ప్రయాణమైంది.
శివాని ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఆమె తండ్రి, సోదరుడు, ఇతర బంధువులు, పక్కింటివారు కలిసి ఓంప్రకాష్‌పై కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబ సభ్యులు గ్వాలియర్‌లోని జయరోగ్య ఆసుపత్రికి తరలించారు. ఆరు రోజుల పాటు చికిత్స పొందినప్పటికీ, ఓంప్రకాష్ కోలుకోలేక మరణించాడు.
ALSO READ: Law College Rape Case: మొదటి సంవత్సరం విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. చార్జిషీట్‌లో సంచలన విషయాలు
పోలీసులు మొదట దాడి కేసు నమోదు చేయగా, మరణం తర్వాత హత్య కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శివాని డిమాండ్ చేసింది. ద్వారిక ప్రసాద్ ఝా, రాజు ఝా, ఉమా ఓఝా, సందీప్ శర్మ అనే నలుగురిపై కేసు నమోదు చేసి, పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


