Homeనేరాలు-ఘోరాలుKataram: వైద్యం వికటించి వ్యక్తి మృతి.. ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

Kataram: వైద్యం వికటించి వ్యక్తి మృతి.. ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

కాటారం(తెలుగు ప్రభ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఓ వ్యక్తి మృతి ఘటన కలకలం రేపింది. వైద్యం అందించే సమయంలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తన భర్త మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి భార్య, కుటుంబ సభ్యులు బాలాజీ ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

అసలేం జరిగిందంటే..

కాటారం మండలం జాదరావుపేటకు చెందిన ఆత్మకూరి కుమార్‌ (40)  వ్యవసాయ పనులకు వెళ్లి శనివారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. అనంతరం ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కాటారంలోని బాలాజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని మరో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే కుమార్‌ మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారని వారు పేర్కొన్నారు. దీంతో మృతదేహాన్ని తిరిగి బాలాజీ ఆసుపత్రి వద్దకు తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. సకాలంలో మెరుగైన వైద్యం అందించి ఉంటే తమ కుటుంబ పెద్దను కాపాడుకునే అవకాశం ఉండేదని మృతుడి భార్య, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స సమయంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పరిస్థితి విషమించిందని ఆరోపించారు.

పూర్తి విచారణ జరపాలని డిమాండ్‌..

బాలాజీ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మృతికి అసలు కారణాలను వెల్లడించి, వైద్య సేవల్లో నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేట్ ఆసుపత్రులపై తనిఖీలు చేయాలి కాటారం మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు నిబంధనల ప్రకారం కొనసాగుతున్నాయా? అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు లేకుండా ఆసుపత్రులు నిర్వహిస్తున్నట్లయితే వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై బాలాజీ ఆసుపత్రి సిబ్బంది వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు. దీంతో మృతికి అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News