Man Killed by Third Wife, Body Found by His Second Wife: మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో జరిగిన ఒక హత్య కేసు వెనుక ఒక షాకింగ్ కథ వెలుగులోకి వచ్చింది. సకారియా అనే గ్రామంలోని ఒక బావిలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తొలుత ఇది సాధారణ హత్యగా భావించారు, కానీ దర్యాప్తులో ఆశ్చర్యపరిచే విషయాలు బయటపడ్డాయి.
ఈ హత్యకు గురైన వ్యక్తి 60 ఏళ్ల భాయలాల్ రాజక్ అని పోలీసులు గుర్తించారు. అతనికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య అతడిని వదిలేసి వెళ్లిపోయింది. రెండో భార్య గుడ్డి బాయితో పిల్లలు లేకపోవడంతో, వారసుల కోసం ఆమె చెల్లెలు మున్నీ అలియాస్ విమలను మూడో వివాహం చేసుకున్నాడు. మున్నీకి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే, మున్నీకి స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి నారాయణ్ దాస్ కుష్వాహా అలియాస్ లల్లుతో వివాహేతర సంబంధం ఉంది.
పోలీసుల ప్రకారం, మున్నీ, లల్లుల మధ్య సంబంధం చాలా తీవ్రంగా మారి, భాయలాల్‌ను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నారు. ఈ పథకంలో భాగంగా లల్లు, ధీరజ్ కోల్ అనే కూలీని ఇందులోకి లాగాడు. ఆగస్టు 30 రాత్రి భాయలాల్ తన నిర్మాణంలో ఉన్న ఇంటిలో నిద్రపోతున్నప్పుడు, లల్లు, ధీరజ్ అతడి తలపై ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశారు. అనంతరం, మృతదేహాన్ని సంచిలో, దుప్పట్లలో చుట్టి, తాడులతో, చీరలతో కట్టి గ్రామంలోని బావిలో పడేశారు.
అయితే, మరుసటి రోజు ఉదయం బావి దగ్గరకు వెళ్లిన రెండో భార్య గుడ్డి బాయికి బావిలో ఏదో తేలుతున్నట్లు కనిపించింది. దగ్గరికి వెళ్లి చూడగా అది తన భర్త మృతదేహం అని గుర్తించి షాక్‌కి గురయ్యారు. ఆమె కేకలు వేయడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బావిలోని నీటిని తోడి మృతదేహంతో పాటు భాయలాల్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోస్టుమార్టంలో భాయలాల్ తీవ్రమైన తల గాయాలతో మరణించినట్లు నిర్ధారణ అయింది. కేవలం 36 గంటల్లోనే పోలీసులు ఈ కేసును చేధించారు. ఎస్పీ మోతీ ఉర్ రెహమాన్ ఈ హత్య వెనుక ఉన్న విషయాన్ని మీడియాకు తెలిపారు. ముగ్గురు నిందితులు మున్నీ, లల్లు, ధీరజ్ కోల్‌లను అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్నారు.


