Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుInsurance Murder : భీమా డబ్బు కోసం.. భార్యను కారుతో తొక్కించి చంపిన భర్త.. ఇంతకీ...

Insurance Murder : భీమా డబ్బు కోసం.. భార్యను కారుతో తొక్కించి చంపిన భర్త.. ఇంతకీ భీమా ఎంతంటే..

భార్య పేరున ఉన్న భీమా డబ్బు కోసం.. ఆమెను కారుతో తొక్కించి అత్యంత దారుణంగా హతమార్చాడో భర్త. అక్టోబర్ 5న రాజస్థాన్ లో జరిగిన ఈ దారుణ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్య పేరున ఉన్న రూ.1.90 కోట్ల డబ్బును కొట్టేయాలని భావించిన దుర్మార్గపు భర్త.. ఆమె ఉసురు తీసేందుకు పన్నాగం పన్నాడు. ఈ మేరకు ఒక రౌడీ షీటర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతను మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్‌పై వెళ్తున్న బాధితురాలిని కారుతో ఢీకొట్టి హత్య చేశాడు.

- Advertisement -

గుడికి వెళ్లాలని భర్త మహేశ్ చంద్ చెప్పడంతో.. అక్టోబరు 5న అతని భార్య షాలు, ఆమె కజిన్ కలిసి ద్విచక్ర వాహనంపై సమీపంలోని ఆలయానికి బయలుదేరారు. ఆ రోజు సాయంత్రం 4.45 గంటల సమయంలో ఓ ఎస్ యూవీ వారిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో షాలు అక్కడికక్కడే మరణించగా.. ఆమె కజిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా రోడ్డుప్రమాదంలో భార్య చనిపోయినట్లు చిత్రీకరించాడు మహేశ్. కానీ షాలు తల్లిదండ్రులకు ఎందుకో అనుమానం వచ్చింది. ప్రమాద ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగుచూసింది. భార్య పేరున ఉన్న ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భర్తే ఈ కుట్రకు ప్లాన్ చేసినట్టు తేలింది. ఆమెది సహజ మరణం అయితే కోటి రూపాయలే వస్తాయని భావించిన మహేశ్.. అదే ప్రమాదంలో మరణిస్తే రూ. 1.90 కోట్లు వస్తాయన్న దుర్బుద్ధితోనే భర్త ఈ కిరాతకానికి పాల్పడినట్టు డీసీపీ వందితా రాణా తెలిపారు. భార్యను హత్య చేయించేందుకు పేరుమోసిన రౌడీ షీటర్ ముకేశ్ సింగ్ రాథోడ్ తో రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా రూ. 5.5 లక్షలు చెల్లించినట్టు పేర్కొన్నారు.

కాగా.. 2015లో మహేశ్-షాలు ల వివాహమవ్వగా.. ఒక కుమార్తె ఉంది. రెండేళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో షాలు తన పుట్టింట్లోనే ఉంటోంది. 2019లో భర్తపై గృహహింస కేసు కూడా పెట్టింది. ఇటీవల షాలు పేరుపై ఇన్సూరెన్స్ చేయించిన చందు.. తానో కోరిక కోరుకున్నానని, అది నెరవేరాలంటే 11 రోజులపాటు ప్రతి రోజూ బైక్‌పై హనుమంతుడి గుడికి వెళ్లాలని భార్యకు చెప్పాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని కూడా హెచ్చరించాడు. తన కోరిక నెరవేరిన వెంటనే ఇంటికి తీసుకొస్తానని భార్యకు చెప్పాడు. భర్త మాటలు నమ్మిన ఆమె ప్రతి రోజూ బైక్‌పై ఆంజనేయుడి గుడికి వెళ్లి రావడం మొదలుపెట్టింది. భర్తపై గుడ్డిగా పెట్టుకున్న నమ్మకమే ఆమె ప్రాణాలు హరించింది. ఈ కేసులో రౌడీ షీటర్ రాథోడ్ తో పాటు, ఎస్ యూవీ యజమాని, సోనులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మహేశ్, మరోకరి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News