Man Who Bludgeoned Wife with Brick Arrested After 21 Years: భార్యను బండరాయితో కొట్టి చంపి 21 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడిని ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 2004లో ఢిల్లీలో జరిగిన ఈ కేసులో, వీర్పాల్ అలియాస్ మైజు అనే 60 ఏళ్ల వ్యక్తి తాజాగా లక్నోలో పట్టుబడ్డాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 2004 సెప్టెంబర్ 22న ఢిల్లీలోని ఒక గదిలో ఓ మహిళ రక్తపు మడుగులో పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆమె నోటికి గుడ్డ కట్టి ఉండటం, శరీరం పక్కన పగిలిన గాజులు, రక్తం మరకల బండరాయి, పగిలిన పన్ను కనిపించాయి. వీర్పాల్ తన భార్యతో సఖ్యతగా లేనందువల్ల ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో అతడి పిల్లలలో ఒకరు సైతం గాయపడినట్లు పేర్కొన్నారు.
తన తండ్రి వీర్పాల్, బాబాయ్ సురేష్ అలియాస్ సాయిజు ఈ దురాగతానికి పాల్పడినట్లు ఆ చిన్నారి పోలీసులకు చెప్పాడు. సహ నిందితుడు సురేష్ కుమార్‌ను 2007లో అరెస్టు చేసి జీవిత ఖైదు విధించారు. అయితే, వీర్పాల్ మాత్రం తప్పించుకుని పారిపోయాడు. లక్నోలో విజయ్ అలియాస్ రామ్‌దయాళ్ పేరుతో జీవిస్తూ కూలీగా పని చేస్తున్నాడు. అక్కడ అతను మరో పెళ్లి చేసుకుని ముగ్గురు కూతుళ్లను కన్నాడు. ఎట్టకేలకు పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, తానే నేరం చేసినట్లు అంగీకరించాడు.


