Maoists Death: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులకు బలమైన స్థావరంగా భావించే అబుజ్‌మడ్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
ఎదురుకాల్పుల అనంతరం, భద్రతా బలగాలు మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. సంఘటనా స్థలం నుండి ఒక ఇన్సాస్ రైఫిల్‌తో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా, ఈ క్రమంలోనే బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం, డీఆర్‌జీ నారాయణ్‌పూర్, కొండగావ్, ఎస్‌టీఎఫ్ దళాలు అబుజ్‌మడ్ ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
దేశంలో మావోయిస్టుల నిర్మూలన లక్ష్యం:
ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు తీవ్రతరం అయ్యాయి. గత కొంతకాలంగా వందలాది మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మరణించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గతంలో మాట్లాడుతూ, వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని చేరుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లు మావోయిస్టు కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి.