Married Woman Allegedly Killed Over Infertility: పిల్లలు పుట్టలేదనే పాపానికి ఓ ఇల్లాలు బలైపోయింది. పెళ్లయిన పదిహేడేళ్లు గడిచినా సంతానం కలగలేదన్న ఒక్కే ఒక్క కారణంతో కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. అత్తింటి వారి ఆరళ్లకు తట్టుకోలేక ప్రాణాలు విడిచింది. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా, కాక్రా గ్రామంలో వెలుగు చూసింది.
ALSO READ: Child Abuse: గే డేటింగ్ యాప్‌లో పరిచయం.. 16 ఏళ్ల బాలుడిపై అత్యాచారం, 14 మందిపై కేసు
వివరాల్లోకి వెళితే.. కాక్రా గ్రామానికి చెందిన అశోక్‌తో సరళ అనే మహిళకు 2005లో వివాహం జరిగింది. అయితే వారికి పిల్లలు పుట్టలేదు. ఇదే కారణంగా అశోక్ రోజూ సరళను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. ఈ క్రమంలోనే, ఆమెను హత్య చేసి, ప్రమాదవశాత్తు ఇంట్లో మంటలు అంటుకుని చనిపోయిందని చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
సరళ మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేస్తుండగా, గ్రామస్థులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అత్తింటివారికి ఫోన్ చేసి అంత్యక్రియలు ఆపమని హెచ్చరించారు. అయినా వారు వినకుండా, సగం కాలిన మృతదేహాన్ని స్మశానానికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, ఖోహ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సరైన సమయానికి అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని డీగ్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ALSO READ: Class 9 Girl Suicide: ప్రేమ పేరుతో ట్రైనీ కానిస్టేబుల్ మోసం.. 9వ తరగతి విద్యార్థిని సూసైడ్
విషయం తెలుసుకున్న సరళ సోదరుడు విక్రాంత్, ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. “పిల్లలు పుట్టలేదని నా సోదరిని రోజూ చిత్రహింసలకు గురిచేసేవాడు. మేం ఎన్నిసార్లు నచ్చజెప్పినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరికి నా సోదరిని బూడిద చేసి, మాకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు” అని విక్రాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు అశోక్, అతని కుటుంబంపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ALSO READ: Blackmail: మైనర్ కుమార్తె ఫోటోలతో బ్లాక్‌మెయిల్.. మేనల్లుడిని చంపి, మృతదేహాన్ని కాల్చేసిన మామ


