Married Woman, Friend Found Dead in Forest: జార్ఖండ్ రాష్ట్రంలో కలకలం రేపిన డబుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఇద్దరు మహిళల మృతదేహాలను గిరిడీహ్ జిల్లాలోని గవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గోల్గో కొండ అటవీ ప్రాంతంలో గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీకాంత్ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు.
మృతురాళ్లు సోని దేవి (23), రింకు దేవి (31)గా పోలీసులు గుర్తించారు. వీరు నిమధి గ్రామానికి చెందినవారు. ప్రాథమిక విచారణలో వారిని గొంతు నులిమి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
ALSO READ: Man Killed by Third Wife: లవర్‌తో కలిసి భర్తను చంపిన మూడో భార్య.. శవాన్ని గుర్తించిన రెండో భార్య!
పోలీసుల వివరాల ప్రకారం, వివాహితురాలైన సోని దేవికి శ్రీకాంత్ చౌదరితో సంబంధం ఉంది. ఈ విషయం రెండు సంవత్సరాల క్రితం గ్రామ పంచాయితీ వరకు వెళ్లింది. పంచాయితీలో ఈ సంబంధం అక్రమమని తేల్చి, శ్రీకాంత్‌కు రూ. 1.7 లక్షల జరిమానా విధించింది. అయినా కూడా వారి సంబంధం కొనసాగింది.
కొంతకాలం క్రితం శ్రీకాంత్, సోనితో ‘మాట్లాడటం మానేస్తే చంపేస్తా’ అని బెదిరించాడని సోని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గత గురువారం సోని తన పొరుగింటి మహిళ రింకుతో కలిసి అడవికి వెళ్లగా, ఇద్దరూ అదృశ్యమయ్యారు. రెండు రోజుల తర్వాత, సోని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కూతురు అదృశ్యం వెనుక శ్రీకాంత్ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేసింది. ఆమె తన కుమార్తె మొబైల్ ఫోన్‌ను పోలీసులకు అందించింది.
ALSO READ: Man Kills Father: ఆస్తి తగాదా.. తండ్రిని చంపి పక్కనే నిద్రపోయిన 19 ఏళ్ల యువకుడు
కాల్ డేటా రికార్డుల ఆధారంగా పోలీసులు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు నేరాన్ని అంగీకరించాడు. నిమధి గ్రామానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోల్గో కొండ అటవీ ప్రాంతంలో తాను మృతదేహాలను పారేసినట్లు తెలిపాడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వందలాది మంది గ్రామస్తులు, బాధితుల కుటుంబ సభ్యులు గవాన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మృతదేహాలను వెతకడానికి లంచం డిమాండ్ చేశారని ఆరోపించారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ స్టేషన్ వద్ద అదనపు బలగాలను మోహరించారు.
ALSO READ: Woman Set On Fire: మంటల్లో కాలుతూనే స్కూటర్ నడిపి ఆసుపత్రికి మహిళ.. చికిత్స పొందుతూ..


