Minor Girl with Speech and Hearing Impairment Raped: రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బందికుయ్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల మూగ, చెవిటి బాలికపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇదీ జరిగిందీ..
ఆదివారం మధ్యాహ్నం ఆడుకుంటూ ఇంట్లోంచి బయటకు వెళ్లి అదృశ్యమైంది ఏడేళ్ల చిన్నారి. ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలించడం మొదలుపెట్టారు. సాయంత్రం చీకటి పడుతుండగా, ఇంటికి సమీపంలోని ఖాళీ స్థలంలో ఆ చిన్నారి పడి ఉండటం చూసి తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. నొప్పి భరించలేక వణుకుతున్న తన కూతురిని చూసి గుండె పగిలినంత పనైంది. వెంటనే వారు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలలో బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ కావడంతో, ఆ కసాయిపని చేసిన వ్యక్తిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని నిందితుడిపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


