Puja Khedkar: మహారాష్ట్రకు చెందిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. తన కారును ఢీ కొట్టాడనే కోపంతో ఓ డ్రైవర్ ను తన ఇంట్లోని ఓ గదిలో బంధించిందని ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదుతో పూజా ఖేడ్కర్ పై కిడ్నాప్ కేసు పెట్టారు. ఇటీవల నవీ ముంబైలో ఓ కాంక్రీట్ మిక్సర్ ట్రక్ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఆ తర్వాత మిక్సర్ ట్రక్ డ్రైవర్ కనిపించకుండా పోయాడు. ఈ ఘటనలోనే పూజపై కేసు నమోదైంది.
Read Also: Railways: టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేయవచ్చా? రైల్వే నిబంధనలు ఏంటో తెలుసా?
అసలేం జరిగిందంటే?
ఇటీవలే నవీ ముంబైలోని ఎరోలీ సిగ్నల్ వద్ద కాంక్రీట్ మిక్సర్ ట్రక్, కారు ఢీకొన్నాయి. ఆ సమయంలో ప్రహ్లాద్‌కుమార్ అనే డ్రైవర్ ట్రక్కును నడిపాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ప్రహ్లాద్‌ను ఇద్దరు వ్యక్తులు బలవంతంగా కారులో తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. విచారణ చేపట్టగా డ్రైవర్ పుణెలోని చతుశృంగి ప్రాంతంలో ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. కారును పరిశీలించి, యజమానిని ప్రశ్నించేందుకు వెళ్లిన పోలీసుల పట్ల పూజా ఖేడ్కర్ తల్లి మనోరమ ఖేడ్కర్ అనుచితంగా ప్రవర్తించారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ గేటు తీసేందుకు నిరాకరించారు. కాసేపటి తర్వాత బలవంతంగా గేటు తెరిచి లోపలికి వెళ్లిన పోలీసులు ఇంట్లోని ఓ గదిలో బంధించిన మిక్సర్ ట్రక్ డ్రైవర్ ను గుర్తించి విడిపించారు. ఈ ఘటనపై పూజా ఖేడ్కర్ మీద కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విధి నిర్వహణకు అడ్డుతగిలిన మనోరమ ఖేడ్కర్ కు సమన్లు జారీ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు రావాలని కోరారు.
నకిలీ సర్టిఫికేట్లు
పూణేలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్(Puja Khedkar)పై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ (UPSC).. ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని ఆమెకు షోకాజ్ నోటీసులిచ్చింది. తనపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తాను ఏ పత్రాలను ఫోర్జరీ చేయలేదని తెలిపారు. యూపీఎస్సీకి తనపై అనర్హత వేటు వేసే అధికారం లేదని వాదించినప్పటికీ.. ఆమెకు నిరాశే ఎదురైంది. గతేడాది ఆగస్టులో ఆమె ముందస్తు బెయిల్‌కు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆమెకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ వచ్చింది. ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, దీనిపై ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు.


