Pulivendula: వివాహేతర సంబంధం కోసం కన్నప్రేమను మరిచింది ఒక తల్లి. సొంత కుమార్తెపై ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడుతుంటే అడ్డుకోవాల్సింది పోయి.. సహకరించింది. రెండు నెలల కిందట జరిగిన ఈ దారుణ ఘటనపై బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
వివాహేతర సంబంధమే కారణం: కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఒక వ్యక్తికి పులివెందులకు చెందిన మహిళతో 2010లో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. సదరు వ్యక్తి 2017లో ఉపాధి కోసం కువైట్ వెళ్లారు. దీంతో భార్య పిల్లలతో కలిసి పులివెందులలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు నవకిషోర్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో గతేడాది వారిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి సదరు మహిళ పిల్లలతో కలిసి పులివెందులలోనే ఒంటరిగా ఉంటోంది.
గదిలోకి బలవంతంగా పంపిన తల్లి: ఈ క్రమంలో నవకిషోర్ ఆ మహిళ మైనర్ కుమార్తెపై కన్నేశాడు. అంతేకాకుండా ఆ బాలికతో తరచూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లికి చెప్పగా.. బయటకు చెబితే చంపేస్తామని తల్లి కూడా కూతురిని బెదిరించింది. రెండు నెలల కిందట నిందితురాలు తన కూతురిని నవకిషోర్ ఉన్న గదిలోకి బలవంతంగా పంపించింది. అక్కడ నవకిషోర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడగా.. ఆమె గట్టిగా కేకలు వేసి అతని బారి నుంచి తప్పించుకుంది.
Also Read-Crime: భర్తను చంపిన భార్య.. ఎందుకో తెలుసా?
తండ్రిని ఆశ్రయించిన బాలిక: అనంతరం భయపడిపోయిన బాలిక ప్రొద్దుటూరు చేరుకుంది. కువైట్ నుంచి తిరిగి వచ్చిన తన తండ్రికి జరిగిన దారుణాన్ని వివరించింది. కాగా ఈ నెల 24న బాలిక తల్లి, అమ్మమ్మ, నవకిషోర్ సోదరి స్వాతి కలిసి ప్రొద్దుటూరులోని బాలిక తండ్రి ఇంటికి వెళ్లారు. బాలికను తమతో పంపాలని గొడవ చేశారు. ఇంటిపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడితో దిగ్భ్రాంతికి గురైన బాలిక తండ్రి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు ఆధారంగా నవకిషోర్, అతని సోదరి స్వాతి, బాలిక తల్లి, అమ్మమ్మలను అదుపులోకి తీసుకున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామాంజనేయుడు వెల్లడించారు.

