Alwal: సభ్యసమాజం తలదించుకునేలా ఓ తల్లి ప్రవర్తించింది. కన్నప్రేమకే కళంకం తెచ్చే ఉదంతం అల్వాల్‌లో వెలుగుచూసింది. పరాయి మగాడి మోజులో పడి ఆరేళ్ల కూతురిని అతిదారుణంగా హతమార్చింది. కన్న బిడ్డను వాటర్ ట్యాంక్‌లో పడేసి.. ఏమీ ఎరుగనట్టు నటించింది.
అక్రమ సంబంధాలే కారణం: కన్నతల్లే కాలయముడై ఆరేళ్ల కూతురిని దారుణంగా హతమార్చిన ఘటన మేడ్చల్ జిల్లా అల్వాల్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందనే నెపంతోనే బిడ్డను తల్లి పథకం ప్రకారం హత్య చేసిందనే అనుమానాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ అంబేద్కర్ నగర్ వజ్ర ఎన్‌క్లేవ్‌కు చెందిన రేఖ అనే మహిళ తన భర్తను వదిలేసి.. తండ్రితో కలిసి ఉంటుంది. అయితే ఆమెకు ఆరేళ్ల కూతురు తన్విక అనే పాప ఉంది. ఈ నెల 16న (శనివారం) రాత్రి 8:30 గంటల సమయంలో తాత ఇచ్చిన రూ.5ను తీసుకుని.. దుకాణానికి వెళ్తానని చెప్పిన తన్విక ఎంతసేపటికీ తిరిగి రాలేదు.
వాటర్ ట్యాంక్‌లో విగతజీవిగా తన్విక: రాత్రి 10:30 గంటల సమయంలో రేఖ తన అక్క శ్వేతకు ఫోన్ చేసి బిడ్డ కనిపించడం లేదని చెప్పింది. దీంతో వెంటనే శ్వేత అక్కడికి చేరుకుంది. అనంతరం ఇరుగుపొరుగు వారితో కలిసి ఇళ్ల పరిసరాల్లో బాలిక కోసం గాలించారు. ఈ క్రమంలోనే వారు ఉంటున్న భవనం పైభాగంలో ఉన్న వాటర్ ట్యాంక్‌లో తన్విక విగతజీవిగా పడి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు.
Also read-Ibrahimpatnam: క్లాస్‌మేట్‌పైనే కన్నేసిన బీటెక్ విద్యార్థి.. మద్యం తాగించి మరీ!
అక్రమ సంబంధమే కారణమా?: తన చెల్లెలు రేఖకు ఉన్న అక్రమ సంబంధాలకు ఆరేళ్ల కూతురు అడ్డు వస్తోందనే కారణంతోనే.. తన్వికను హత్య చేసి వాటర్ ట్యాంక్‌లో పడేసి ఉంటుందని అక్క శ్వేత పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్వేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కన్నతల్లి రేఖ ప్రవర్తనపై గట్టి అనుమానాలు వ్యక్తమవుతుండటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణలో తేలాల్సి ఉంది.

