Balanagar suicide case: సంసారంలో వచ్చే చిన్న చిన్న చిచ్చులు.. కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. ఆలుమగలు అన్నాక గొడవలు సహజం. కానీ క్షణికావేశంలో జరిగే ఘర్షణలు.. హత్యలు, ఆత్మహత్యలను ఉసిగొల్పుతున్నాయి. దీంతో ముక్కుపచ్చలారని చిన్నారులతో పాటు తల్లుల గొంతులు సైతం మూగబోతున్నాయి. తాజాగా ఇలాంటి విషాద ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
తల్లి కఠిన నిర్ణయం: హైదరాబాద్‌లోని బాలానగర్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. భర్త వేదింపులు తాళలేక ఓ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. తాను చనిపోతే తన పిల్లలు అనాథలుగా మారవద్దని.. తమతోపాటే పిల్లలను కూడా కానరాని లోకానికి తీసుకెళ్లింది. ఇద్దరు చిన్నారులను హత్య చేసి.. ఆ తర్వాత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మృతిచెందిన తల్లిని చల్లారి సాయిలక్ష్మీ (27)గా పోలీసులు గుర్తించారు. ఆమె భర్త అనిల్ కుమార్‌తో కలిసి పద్మారావు నగర్ ఫేజ్–1, బాలానగర్‌లో కొంతకాలంగా నివాసం ఉంటుంది. సాయిలక్ష్మీకి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. వారి పేరు చేతన్ కార్తికేయ, లాస్యతవల్లి అని పోలీసులు తెలిపారు.
అలుముకున్న విషాదఛాయలు: భర్తతో వచ్చిన కుటుంబ విభేదాలు, వ్యక్తిగత సమస్యల నేపథ్యంలో సాయిలక్ష్మీ తీవ్ర మనస్థాపానికి గురైంది. క్షణికావేశంలో తన ఇద్దరు పిల్లలను చంపి అనంతరం బిల్డింగ్ పై నుంచి దూకి ప్రాణాలు విడిచింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ గొడవలే కారణమని పోలీసులు తెలిపారు. పూర్తి దర్యాప్తు తర్వాతే తల్లీ బిడ్డల మరణానికి గల అసలు కారణాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తల్లితో పాటు ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారుల మరణంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


