Mother kills son for extramarital affair : అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్నకొడుకునే కడతేర్చిందో కసాయి తల్లి. ప్రియుడి మోజులో పడి పేగుబంధాన్ని మరిచింది. పది నెలల పాటు కొడుకు బతికే ఉన్నాడని అందరినీ నమ్మించి, చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఈ దారుణ ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలు ఏమిటి..? కన్నతల్లే కాలయముడిగా మారడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి..? ఈ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు..?
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్న కుమారుడిని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఓ తల్లి ఉదంతం పది నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్‌లో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తూప్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం, తూప్రాన్ మండలం వెంకటాయపల్లికి చెందిన మహమ్మద్ రెహానాకు 30 ఏళ్ల క్రితం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలానికి చెందిన జహంగీర్‌తో వివాహం జరిగింది. వీరికి అహ్మద్ పాషా (25) అనే కుమారుడు ఉన్నాడు. పాషా పుట్టిన కొద్దికాలానికే తండ్రి మరణించడంతో, రెహానా తన కొడుకుతో కలిసి వెంకటాయిపల్లిలోనే నివసిస్తోంది. కూలి పనులు చేసుకునే క్రమంలో ఆమెకు మనోహరాబాద్ మండలానికి చెందిన కందల భిక్షపతితో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న కుమారుడు అహ్మద్ పాషా, తల్లిని పలుమార్లు మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినా కొడుకు మాటలను పెడచెవిన పెట్టిన రెహానా, తన ప్రియుడితో సంబంధాన్ని కొనసాగించింది. ఈ విషయమై తల్లీకొడుకుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
హత్యకు పక్కా ప్రణాళిక: తన వివాహేతర సంబంధానికి కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించిన రెహానా, ప్రియుడు భిక్షపతితో కలిసి అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. గతేడాది నవంబర్ 28న, మాట్లాడదాం రమ్మని పాషాను పిలిచారు. భిక్షపతి తన బైక్‌పై పాషాను ఎక్కించుకుని ఆబోతుపల్లి గ్రామ శివారులోని హల్దీవాగు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ పాషాను నమ్మించి మద్యం తాగించారు. అనంతరం తల్లి రెహానా తన చున్నీతో కొడుకు మెడకు ఉరివేయగా, ప్రియుడు భిక్షపతి తాడుతో గొంతు నులిమి చేతులు కట్టేశాడు. పాషా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని హల్దీవాగులో పడేసి వెళ్లిపోయారు.
మిస్టరీ వీడిందిలా: అదే రోజు హల్దీవాగులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో, పరిసర ప్రాంతాల్లో ఫోటోలతో కూడిన పోస్టర్లను అంటించారు. దాదాపు 10 నెలల తర్వాత, ఆగస్టు 15న ఓ వ్యక్తి ఆ పోస్టర్‌ను చూసి మృతుడిని అహ్మద్ పాషాగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు పాషా ఇంటికి వెళ్లగా, తల్లి రెహానా ఏమాత్రం కంగారు లేకుండా కనిపించింది. కొడుకు కనిపించకపోయినా 9 నెలలుగా ఫిర్యాదు చేయకపోవడంతో ఆమెపై అనుమానం బలపడింది. విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. తన కొడుకు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడని గ్రామస్తులను నమ్మించినట్లు తెలిపింది. పోలీసులు రెహానాతో పాటు ఆమె ప్రియుడు భిక్షపతిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును విజయవంతంగా ఛేదించిన పోలీసు సిబ్బందికి డీఎస్పీ నరేంద్ర గౌడ్ రివార్డు ప్రకటించారు. “సాంకేతిక ఆధారాలతో మృతుడిని గుర్తించాం. గత 15-20 ఏళ్ల నుంచి భిక్షపతి అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంపై కుమారుడు మందలిస్తున్నాడని, తమ బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే హత్య చేశారు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకే ఫిర్యాదు చేయలేదు” అని డీఎస్పీ నరేంద్ర గౌడ్ తెలిపారు.


