Janardhana Rao arrested in Gannavaram: సంచలనం సృష్టించిన ములకలచెరువు నకిలీ మద్యం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నకిలీ మద్యం తయారీలో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధన్‌రావును ఎక్సైజ్ అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. నకిలీ మద్యం తయారీ రాకెట్ బయటపడేటప్పటికి ఆఫ్రికాలో ఉన్న జనార్ధన్‌రావు శుక్రవారం సాయంత్రం తొలుత ముంబయికి చేరుకున్నారు. అక్కడి నుంచి గన్నవరానికి వస్తారన్న ముందస్తు సమాచారంతో.. ఎక్సైజ్ బృందాలు అక్కడ మాటు వేశాయి. జనార్ధన్‌రావు విమానాశ్రయం నుంచి బయటకు రాగానే అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నట్టు తెలుస్తుంది.
హెబియస్ కార్పస్ దాఖలకు సిద్ధం : ఎక్సైజ్ బృందాలు జనార్ధన్‌రావు అదుపులో తీసుకున్న సమాచారం తమకు అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జనార్ధన్‌రావు ఆచూకీ కోసం హెబియస్ కార్పస్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు.. జనార్ధన్‌రావు తరపు లాయర్‌లు తెలిపారు. జనార్ధన్‌రావు అరెస్ట్‌పై పోలీసులు ఇంతవరకు స్పందించలేదు. కానీ శనివారం సాయంత్రంలోగా అతన్ని న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది.
14 మందిపై కేసు నమోదు: మొలకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇప్పటికే ముమ్మరం దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధన్‌రావుతో కలిపి మొత్తం 14 మందిపై కేసు నమోదు చేయగా.. 13 మందిని అరెస్ట్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు విదేశాల్లో ఉండటంతో అతడు ఈ రోజు గన్నవరానికి చేరుకోగా.. ముందస్తు సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు.


