Mumbai Man Choked, Daughter Beaten Up For Opposing Pigeon Feeding: పావురాలకు దాణా వేయడాన్ని వ్యతిరేకించినందుకు ఓ మహిళ, ఆమె తండ్రిపై దాడి జరిగింది. ఈ ఘటన ముంబైలోని మీరా రోడ్ సమీపంలోని ఓ నివాస సముదాయం వద్ద చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ ముందు కొంతమంది పావురాలకు దాణా వేయడాన్ని ప్రేమాళ్ పటేల్ అనే మహిళ, ఆమె తండ్రి వ్యతిరేకించారు. ఇది గొడవకు దారితీసింది. ఆవేశంతో రగిలిపోయిన దాణా వేస్తున్న వ్యక్తులు పటేల్‌పై ఇనుప రాడ్‌తో దాడి చేయగా, ఆమె తండ్రి గొంతు నులిమినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రీకూతుళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందగా, వారు వెంటనే రంగంలోకి దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆశ వ్యాస్, సోమేశ్ అగ్నిహోత్రి, మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారని సమాచారం.
ముంబైలో పెరుగుతున్న పావురాల సంఖ్య, వాటి కారణంగా తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, పావురాల వ్యర్థాల వల్ల శ్వాసకోశ వ్యాధులు వ్యాపిస్తున్నాయనే ఆందోళన ఉంది. గతంలో, బాంబే హైకోర్టు పావురాలకు దాణా వేయడం ప్రజారోగ్యానికి హానికరం అని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పావురాలకు దాణా వేసేవారిపై చర్యలు చేపడుతోంది. ఈ ఘటన, పావురాల దాణా సమస్యపై జరుగుతున్న చర్చకు మరోసారి బలాన్నిచ్చింది. ఈ వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది.


