Friday, December 12, 2025
Homeనేరాలు-ఘోరాలుStock Market Scam: వృద్ధుడికి రూ. 35 కోట్ల షాక్.. 4 ఏళ్లుగా నడుస్తున్న 'మాయ'...

Stock Market Scam: వృద్ధుడికి రూ. 35 కోట్ల షాక్.. 4 ఏళ్లుగా నడుస్తున్న ‘మాయ’ గ్రహించేలోపే అంతా ఆవిరి!

Mumbai Man Loses Rs 35 Crore in Stock Market Scam: స్టాక్ మార్కెట్ అంటేనే లాభనష్టాల ఊయల. అయితే నష్టమొస్తే తట్టుకోవచ్చు, కానీ మోసం జరిగితేనే గుండె తట్టుకోలేదు. సరిగ్గా ఇలాంటి ఘటనే ముంబైలో చోటుచేసుకుంది. 72 ఏళ్ల ఓ వృద్ధ వ్యాపారి ఏకంగా 35 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. అది కూడా ఒకటీ రెండు రోజుల్లో కాదు, ఏకంగా నాలుగేళ్ల పాటు ఆయనకు తెలియకుండానే ఆయన ఖాతాలో ఈ ఫ్రాడ్ జరిగింది. బాధితుడు భరత్ హరక్‌చంద్ షా (Bharat Harakchand Shah) ఫిర్యాదుతో గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ (Globe Capital Market Limited) అనే సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు రూ.35 కోట్ల మోసం ఎలా బయటపడిందో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

- Advertisement -

ALSO READ: Nano Banana Pro: ఇదేం ఫీచర్‌ గూగుల్‌ మావా.. ఏఐతో ఫేక్ ఆధార్, ఫేక్ పాన్ కార్డ్.. తల పట్టుకుంటున్న సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్‌..!

క్యాన్సర్ రోగులకు సేవ చేస్తూ..

ముంబైలోని మాతుంగా వెస్ట్‌లో నివసించే భరత్ షా ఒక సామాజిక సేవా దృక్పథం ఉన్న వ్యక్తి. పరేల్ ప్రాంతంలో క్యాన్సర్ రోగుల కోసం తక్కువ అద్దెకే ఒక గెస్ట్ హౌస్ నడుపుతున్నారు. 1984లో తండ్రి మరణానంతరం వారసత్వంగా వచ్చిన షేర్లు ఆయన వద్ద ఉన్నాయి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పై పెద్దగా అవగాహన లేకపోవడంతో ఆ షేర్లను అలాగే ఉంచారు. కానీ 2020లో ఒక మిత్రుడి సలహా మేరకు గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో డీమ్యాట్ ఖాతా తెరిచారు. ఇదే ఆయన చేసిన పొరపాటైంది.

నమ్మించి నట్టేట ముంచారు

ఖాతా తెరిచే సమయంలో కంపెనీ ప్రతినిధులు మాయమాటలు చెప్పారు. “మీరు పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు, ఉన్న షేర్లను తాకట్టుగా ఉంచి ట్రేడింగ్ చేస్తాం, లాభాలు ఇస్తాం” అని నమ్మబలికారు. అక్షయ్ బారియా, కరణ్ సిరోయా అనే ఇద్దరు ఉద్యోగులను ‘పర్సనల్ గైడ్స్’గా నియమించారు. వీరు తరచూ భరత్ షా ఇంటికి వెళ్లడం, ఆయన ల్యాప్‌టాప్ నుంచే లావాదేవీలు నడపడం, ఓటీపీలు (OTPs) తీసుకోవడం చేశారు. భరత్ షా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆయన ఈమెయిల్, ఫోన్ మెసేజ్‌ల కంట్రోల్ కూడా వారే తీసుకున్నారు.

నాలుగేళ్లు భ్రమలోనే..

ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. 2020 నుంచి 2024 జూన్ వరకు భరత్ షాకు ప్రతి ఏడూ ఒక స్టేట్‌మెంట్ వచ్చేది. అందులో భారీగా లాభాలు వచ్చినట్లు చూపించేవారు. అది చూసి ఆయన సంబరపడిపోయారు. కానీ తెరవెనుక ఆ ఇద్దరు ఉద్యోగులు విచ్చలవిడిగా ట్రేడింగ్ చేస్తూ, ఒకే షేర్‌ను అటు ఇటు తిప్పుతూ (Circular Trading) నష్టాలు మిగిల్చారు. కంపెనీ నుంచి వచ్చే అసలైన మెయిల్స్‌ను ఆయనకు తెలియకుండా డిలీట్ చేసి, ఫేక్ ప్రాఫిట్ స్టేట్‌మెంట్లను సృష్టించి చూపించేవారు.

ఒక్క ఫోన్ కాల్‌తో గుండె ఆగిపోయినంత పనైంది!

జులై 2024లో అకస్మాత్తుగా కంపెనీ రిస్క్ మేనేజ్మెంట్ నుంచి భరత్ షాకు ఫోన్ వచ్చింది. “మీ ఖాతాలో రూ. 35 కోట్ల డెబిట్ ఉంది. వెంటనే కట్టకపోతే మీ షేర్లు అమ్మేస్తాం” అని చెప్పారు. అది వినగానే ఆయనకు కాళ్ల కింద భూమి కదిలింది. ఆఫీసుకు వెళ్లి ఆరా తీయగా.. అసలు విషయం తెలిసింది. గత్యంతరం లేక తన వద్ద మిగిలిన షేర్లను అమ్మి ఆ అప్పు కట్టేశారు. ఆ తర్వాత కంపెనీ వెబ్‌సైట్ నుంచి అసలైన స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసి చూడగా.. ఇన్నాళ్లు తనకు మెయిల్‌లో వచ్చినవి నకిలీవని అర్థమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నుంచి వచ్చిన హెచ్చరిక నోటీసులను కూడా ఆ కేటుగాళ్లు ఆయనకు తెలియకుండా దాచేశారు.

దీంతో ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఆర్థిక నేరమని గ్రహించిన భరత్ షా పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసును ముంబై ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) దర్యాప్తు చేస్తోంది.

ALSO READ: Gadwal murder : ప్రమాదం ముసుగులో పగ: మాజీ సర్పంచ్‌ హత్య.. పట్టించిన బొలెరో!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News