Financial Crime Case: నటి శిల్పా శెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాపై నమోదైన రూ. 60 కోట్ల మోసం కేసులో.. ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా రాజ్ కుంద్రా కొన్ని సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం.
హీరోయిన్లకు ఫీజుల చెల్లింపు: ఈఓడబ్ల్యూ అధికారులు రాజ్ కుంద్రాను సుమారు ఐదు గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా ఆయన తమ కంపెనీ నుంచి బిపాసా బసు, నేహా ధూపియా వంటి ప్రముఖ హీరోయిన్లకు ఫీజుల రూపంలో.. డబ్బులు చెల్లించినట్లు అంగీకరించారని తెలుస్తోంది. అయితే పలు కీలక ప్రశ్నలకు మాత్రం ఆయన సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం. దీంతో అధికారులు మరోసారి ఆయనను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో రాజ్ కుంద్రాతో పాటు ఆయన భార్య శిల్పా శెట్టిపైనా దర్యాప్తు కొనసాగుతోందని ముంబై పోలీసులు స్పష్టం చేశారు.
అనుమానాస్పద లావాదేవీలు: ఈ దర్యాప్తులో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుంద్రా కంపెనీ ఖాతాల నుంచి శిల్పా శెట్టి, బిపాసా బసు, నేహా ధూపియా సహా మొత్తం నలుగురు నటీమణుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా డబ్బు బదిలీ అయినట్లు ఆధారాలు లభించాయి. ఇప్పటివరకు అధికారులు దాదాపు రూ. 25 కోట్ల మేర ప్రత్యక్ష బదిలీలను గుర్తించారు.
ఆ సమయంలోను అనుమానాస్పద లావాదేవీలు: పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) సమయంలో కూడా ఈ కంపెనీ నుంచి పలు అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ బదిలీలకు సంబంధించిన సాక్ష్యాలను ఇప్పటికే భద్రపరిచారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరికొంత మందిని విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.


