Woman Charged for Cheating Husband: మహారాష్ట్రలోని ముంబైలో ఒక మహిళ ఏకంగా తన భర్తనే మోసం చేసింది. అతడి వద్ద నుంచి రూ. 1.73 కోట్లు కాజేసింది. భర్తకు రుణం ఇప్పిస్తానని చెప్పి, ఆ తర్వాత తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆ మహిళతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది.
ALSO READ: Three Drown After Cremation: అంత్యక్రియల అనంతరం నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు దుర్మరణం
భండూప్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. విశాల్ అశోక్ రోడే అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు అతని భార్య పూనమ్ రోడేతో పాటు ఆమె సహచరులు సచిన్ యెలవి, సుహాస్ పవార్, కిషోర్ పవార్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గత ఏడు సంవత్సరాలుగా పూనమ్ తన భర్తను మోసం చేస్తోందని పోలీసులు తెలిపారు.
2019 సెప్టెంబర్‌లో పూనమ్ తన భర్తకు సచిన్ యెలవి, సుహాస్ పవార్‌లను పరిచయం చేసింది. వారు వ్యాపారవేత్తలని, తన భర్తకు రుణం ఇప్పించగలరని చెప్పింది. సుహాస్ పవార్‌కు తెలిసిన మహత్రే అనే వ్యక్తి ఒక సంస్థ ద్వారా రూ. 3 కోట్లు రుణం ఇస్తాడని చెప్పి, దాని కోసం ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 6.92 లక్షలు యెలవికి చెల్లించేలా చేసింది. అయితే ఆ రుణం ఎప్పటికీ మంజూరు కాలేదు.
ALSO READ: Lover Killed Woman: పెళ్లి కోసం 600 కి.మీలు ప్రయాణించిన మహిళ.. ప్రియుడి చేతిలోనే దారుణ హత్య
ఆ తర్వాత సుహాస్ పవార్ కార్యాలయంలో పనిచేసే ఒక మహిళ విశాల్‌తో వాట్సాప్‌లో చాటింగ్ చేసి, అసభ్యకరమైన ఫోటోలను పంపించింది. వాటిని ఉపయోగించి నిందితులు విశాల్‌ను బెదిరించారు. తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించి, ఈ విషయాన్ని పరిష్కరించుకునేందుకు విశాల్ నుంచి డబ్బులు వసూలు చేశారు.
పూనమ్ రోడే కూడా 2022 నుంచి ప్రతి నెల రూ. 2.20 లక్షలు తన భర్త ఖాతా నుంచి తన ఖాతాలోకి బదిలీ చేసుకుని, మొత్తం రూ. 82.23 లక్షలు కాజేసింది. చివరికి నిందితులు తన ఆస్తి పత్రాలపై సంతకం చేయమని బలవంతం చేయడంతో విశాల్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.


