Nagarri Insurance Murder : ఇన్సూరెన్స్ నగదు కోసం ఓ వృద్ధుడి ప్రాణం తీశారు. మృతదేహాన్ని ముక్కలు చేసి చెరువులో పడేశారు. మంగళవారం ఈ దారుణం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, నగరి పట్టణ పరిధిలోని కొత్తపేటకు చెందిన గుణశీలన్ (65)కు నలుగురు సంతానం. సంగీత, జ్యోతి, వసంత్, విజయ్. వీరిలో విజయ్‌కు మూడేళ్ల క్రితం కొత్తపేటలోనే గంగాధరం కుమార్తె కౌసల్యతో వివాహం జరిగింది. కానీ కుటుంబ తగాదాలతో వివాహానికి ఆరు నెలల్లోనే విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే కౌసల్య గర్భవతి. ఆమెకు రెండో పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో కౌసల్య కుటుంబీకులు గర్భాన్ని తొలగించారు.
మరోవైపు విజయ్ అప్పటికే ఇన్సూరెన్స్ పాలసీ వేసి ఉండటంతో రూ.1.25 కోట్లు వచ్చాయి. నామినీగా ఉన్న తండ్రి గుణశీలన్ బ్యాంకు ఖాతాకు జమయ్యాయి. ఈ నగదులో రూ.10 లక్షలను మాత్రమే రెండో పెళ్లికి సిద్ధమైందన్న కారణంతో కౌసల్యకు ఇచ్చాడు. తక్కువ నగదు ఇచ్చాడని కౌసల్య తండ్రి గంగాధరం పగపెంచుకున్నాడు. ఈ క్రమంలో గుణశీలన్ దంపతులు తిరుపతికి వెళ్లిపోయారు. కొత్తపేటలోని ఇంటిని బుగ్గ అగ్రహారానికి చెందిన అయ్యప్పకు ఇచ్చాడు. మాటల్లో గుణశీలన్ వద్ద డబ్బులున్న విషయాన్ని గ్రహించిన అయ్యప్ప అప్పుగా రూ.30 లక్షలు తీసుకున్నాడు. అప్పు తీర్చకపోవడంతో గుణశీలన్ గట్టిగా అడిగాడు. ఈ నేపథ్యంలో జూన్ 24వ తేదీ నుంచి గుణశీలన్ కనిపించడం లేదని కుమార్తె సంగీత తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు భాగంగా అయ్యప్పను విచారించగా హత్య ఉదంతం బయటపడింది. అప్పు అడుగుతున్నాడని, ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వలేదని అయ్యప్పన్, గంగాధరం ఈ హత్య చేసినట్లు తేలింది. పథకం ప్రకారం జూన్ 24వ తేదీ మధ్యాహ్నం గుణశీలన్‌ను నిందితులిద్దరూ నగరిలోని ఇంటికి తీసుకొచ్చారు. తల వెనుకవైపు బలమైన కట్టెతో కొట్టగా అతను మృతిచెందాడు. చీకటిపడ్డాక ఇద్దరూ కలిసి మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టుకుని నగరి మండలంలోని ఎం.కొత్తూరు చెరువుకట్టవద్దకు చేరుకున్నారు. అక్కడే మృతదేహాన్ని ముక్కలుచేసి చెరువులో వేసినట్లు నిందితులు తెలపారు. మంగళవారం సాయంత్రం చెరువు వద్దకు నిందితులతోపాటు చేరుకుని గాలింపు చేపట్టారు. చీకటి పడటంతో గాలింపును, పోస్టుమార్టంను బుధవారానికి వాయిదా వేశారు. ఈ విషయం తెలియడంతో సంఘటన స్థలం జనం గుమికూడారు.


