Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుNagpur Blast: నాగ్‌పూర్ సోలార్ కంపెనీలో ఘోర విస్ఫోటనం...ఒకరు మృతి!

Nagpur Blast: నాగ్‌పూర్ సోలార్ కంపెనీలో ఘోర విస్ఫోటనం…ఒకరు మృతి!

Nagpur Solar Explosives Company blast : నాగ్‌పూర్‌ సమీపంలోని సోలార్ ఎక్స్‌ప్లోజివ్స్ తయారీ సంస్థలో గురువారం తెల్లవారుజామున తీవ్రమైన పేలుడు సంభవించింది. బజార్‌గావ్ సమీపంలోని సోలార్ ఇండస్ట్రీస్ ప్లాంట్‌లో అత్యంత శక్తివంతమైన పేలుడు సంభవించడంతో ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, 17 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 

- Advertisement -

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కంపెనీలోని కాస్ట్ బూస్టర్ (CB-1) ప్లాంట్‌లో పేలుడు పదార్థాల మిశ్రమాన్ని తయారుచేసే క్రిస్టలైజేషన్ ప్రక్రియ జరుగుతుండగా ఈ విస్ఫోటనం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పేలుడుకు ముందు యూనిట్ నుంచి దట్టమైన పొగలు వెలువడటాన్ని గమనించిన సీనియర్ కార్మికులు, వెంటనే అప్రమత్తమై తోటి కార్మికులను బయటకు వెళ్ళిపోవాలని హెచ్చరించారు. వారు బయటకు పరుగులు తీస్తున్న క్రమంలోనే, సుమారు 20-25 నిమిషాల తర్వాత భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.

క్షణాల్లో ఛిద్రమైన భవనం.. చెల్లాచెదురైన కార్మికులు : పేలుడు తీవ్రతకు ప్లాంట్ భవనం పూర్తిగా ధ్వంసమై, శకలాలు వందల మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు గాలిలోకి ఎగిరిపడి చెల్లాచెదురుగా పడిపోయారు. మయూర్ గన్వీర్ అనే కార్మికుడు శిథిలాల కింద చిక్కుకొని దుర్మరణం పాలయ్యాడు. మరో 17 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన నాగ్‌పూర్‌లోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

పునరావృతమవుతున్న ప్రమాదాలు.. భద్రత గాలికి : ఈ కంపెనీలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇది మొదటిసారి కాదని, గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. డిసెంబర్ 2023లో జరిగిన ఓ పేలుడులో ఏకంగా తొమ్మిది మంది కార్మికులు మరణించారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోవడం లేదని, పారిశ్రామిక భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేశారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు.. విచారణకు ఆదేశం : ఘటన గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళాలు, మరియు సహాయక బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరో పేలుడు సంభవించకుండా ముందుజాగ్రత్త చర్యగా కూలింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రమాదానికి గల కారణాలపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. NCP (SP) నేత, మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఫ్యాక్టరీ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు నాగ్‌పూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పోద్దార్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad