Nalgonda Police Crack Down on Lucky Draw Scam: నల్గొండ జిల్లాలో సంచలనం రేపిన భారీ లక్కీ డ్రా మోసం వెలుగులోకి వచ్చింది! అమాయక ప్రజల ఆశలను పెట్టుబడిగా మార్చుకుని, కోట్లకు పడగలెత్తిన ముగ్గురు కేటుగాళ్లను మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 6.55 లక్షల నగదుతో పాటు, రూ. 70 లక్షల విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఈ మోసగాళ్లు ఎవరూ? ఎలా తమ వలలో 2100 మందికి పైగా అమాయకులను చిక్కుచ్చుకున్నారు? తెలుసుకోవాలంటే ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే.
మోసపూరిత వ్యూహం: మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీ కేంద్రంగా ‘ఆర్‌కే ఎంటర్‌ప్రైజెస్’ పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థను స్థాపించిన మోసగాళ్లు, ఆర్థికంగా ఎదగాలని ఆశపడే వేలాది మంది అమాయకులను తమ వలలోకి లాగారు. వీరు రూపొందించిన వ్యూహం అత్యంత నమ్మశక్యం కానిది. నెలకు వెయ్యి రూపాయల చొప్పున 15 నెలలు చెల్లిస్తే, ఆ మొత్తానికి సరిపడా విలువైన వస్తువుతో పాటు, ప్రతి నెలా పది మందికి లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందిస్తామని మభ్యపెట్టారు.
ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు, ప్రారంభంలో కొద్ది రోజుల పాటు లక్కీ డ్రా బహుమతులు అందించి, ‘మాటిచ్చి మాయం చేసే రకం కాదు’ అన్న నమ్మకాన్ని కల్పించారు. ఏజెంట్ల ద్వారా మిర్యాలగూడ పట్టణం, పరిసర గ్రామాలలోని సుమారు 2143 మందిని ఈ పథకంలో చేర్చుకున్నారు. వారి నుంచి ఏకంగా రూ.1 కోటి 85 లక్షల 79 వేలు వసూలు చేశారు. అయితే, సేకరించిన మొత్తంలో కేవలం రూ.50 లక్షలు మాత్రమే బహుమతుల కోసం ఖర్చు చేసి, మిగతా డబ్బుతో ఇళ్లు, ప్లాట్లు, ఖరీదైన ఇంటి సామాగ్రిని కొనుగోలు చేస్తూ తమ జేబులు నింపుకున్నారు.దీనితో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.
మోసాల చిట్టా: అడుగడుగునా ఆశ్చర్యపరిచే వాస్తవాలు : మిర్యాలగూడ పట్టణంలో సుమారు రెండు కోట్ల రూపాయల నగదును కొల్లగొట్టిన ముగ్గురు నిందితులను శుక్రవారం మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ మిర్యాలగూడ వన్ టౌన్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
మోసం వెనుక సూత్రధారులు: ఈ భారీ మోసం వెనుక అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన కొమ్ము రమేష్, కొమ్ము కోటేశ్వర రావు ఉన్నారు. వీరితో పాటు, దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన బచ్చలకూరి శ్రీను కూడా ప్రధాన నిందితుల్లో ఒకరు. ఈ ముగ్గురూ సులభంగా, అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే తీవ్రమైన దురాశ వారిని ఈ మోసపూరిత పథకాన్ని రూపొందించేలా పురికొల్పినట్లు సమాచారం.
పోలీసుల చర్యలు: బాధితుల ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 6.55 లక్షల నగదు, రెండు ప్లాట్లు, ఒక ఇంటి దస్తావేజు, ఒక ఫంక్షన్ హాల్ లీజు దస్తావేజు, విలువైన ఫర్నిచర్, రెండు బైక్‌లు, ఒక ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరించారు. స్వాధీనం చేసుకున్న సొత్తును కోర్టులో డిపాజిట్ చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు ఆధ్వర్యంలో సమర్థవంతంగా పనిచేసిన సీఐ మోతీరామ్, ఎస్‌ఐ సైదిరెడ్డి, ఇతర కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. మల్టీ లెవల్ మార్కెటింగ్, లక్కీ డ్రాల పేరిట ఏర్పాటు చేసే ఇలాంటి సంస్థల్లో ప్రజలు సభ్యులుగా చేరి మోసపోవద్దని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. ఆశపడితే ఇలాంటి మోసాలకు బలయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.