Nalgonda POCSO court verdict : అమ్మ అంటే అనురాగం.. అంతులేని ఆప్యాయత. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే కాలనాగై కాటేస్తే..? రక్షించాల్సిన చేతులే రాక్షసత్వానికి సహకరిస్తే..? నల్గొండ జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన మానవత్వానికే పెను సవాల్ విసురుతోంది. ప్రియుడి కామవాంఛకు కన్నకూతురినే బలిపశువును చేయబోయిన ఓ కసాయి తల్లికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. ఈ కేసు విచారణలో వెలుగు చూసిన నిజాలు, తీర్పు సమయంలో జరిగిన నాటకీయ పరిణామాలు వింటే గుండె తరుక్కుపోతుంది. అసలు ప్రియుడితో కలిసి ఆ తల్లి పన్నిన పన్నాగం ఏంటి..? ఆ పసిమొగ్గ నరకం నుంచి ఎలా బయటపడింది..?
నల్గొండ పట్టణంలో జరిగిన ఈ అమానవీయ ఘటన వివరాలను ప్రాసిక్యూషన్ వెల్లడించింది. పట్టణంలోని లైన్‌వాడి ప్రాంతానికి చెందిన గ్యారాల శివకుమార్‌కు, స్థానిక బీటీఎస్ కాలనీలో నివసించే వసంతపురి యాదమ్మతో వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరికీ అప్పటికే వేర్వేరుగా కుటుంబాలు, పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో, యాదమ్మకు ఉన్న 14 ఏళ్ల కుమార్తెపై శివకుమార్ కన్ను పడింది. ఆ బాలికను ఎలాగైనా అనుభవించాలనే దుర్బుద్ధితో, “ఆమెను పెళ్లి చేసుకుంటాను” అని యాదమ్మకు మాయమాటలు చెప్పి, ఆమెను తన పాపంలో భాగస్వామిని చేశాడు.
తల్లే దగ్గరుండి : ప్రియుడి మాటలు నమ్మిన యాదమ్మ, కన్నకూతురి భవిష్యత్తును తన చేతులతోనే నాశనం చేయడానికి సిద్ధపడింది. శివకుమార్ ఆ బాలికను బలవంతంగా వివాహం చేసుకొని, అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా, ఆ చిన్నారి తీవ్రంగా ప్రతిఘటించింది. ఆ సమయంలో, కూతురికి అండగా నిలవాల్సిన తల్లే, ప్రియుడికి అండగా నిలిచింది. తల్లి యాదమ్మ సాయంతోనే శివకుమార్ ఆ చిన్నారిని బెదిరించి, లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు.
ధైర్యంగా ఫిర్యాదు చేసిన బాలిక : తల్లి, ఆమె ప్రియుడు పెడుతున్న నరకయాతనను భరించలేని ఆ బాలిక, ఒకరోజు ధైర్యం చేసి ఇంటి నుంచి పారిపోయి, నేరుగా నల్గొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన గోడును వెళ్లబోసుకుంది. బాలిక చెప్పిన విషయాలు విని విస్తుపోయిన పోలీసులు, తక్షణమే రంగంలోకి దిగారు. నిందితులైన యాదమ్మ, శివకుమార్‌లను అరెస్టు చేసి, వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పక్కా సాక్ష్యాధారాలతో ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు.
తీర్పు వేళ నిందితుడి పరారీ.. తల్లికి శిక్ష : ఈ కేసుపై విచారణ జరిపిన నల్గొండ ప్రత్యేక పోక్సో కోర్టు, మంగళవారం తీర్పు వెలువరించడానికి సిద్ధమైంది. అయితే, విచారణలో నేరం రుజువై, తనకు శిక్ష తప్పదని గ్రహించిన ప్రధాన నిందితుడు శివకుమార్, ఒక నాటకానికి తెరలేపాడు. “మూత్రశాలకు వెళ్లొస్తా” అని న్యాయమూర్తి అనుమతి తీసుకుని, అక్కడి నుంచి ఉడాయించాడు.
అనంతరం, కోర్టులో హాజరైన యాదమ్మపై నేరం నిరూపితమైందని ఇన్‌ఛార్జి న్యాయమూర్తి రోజారమణి ప్రకటించారు. కన్నకూతురని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తించిన కసాయి తల్లి యాదమ్మకు 22 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు, రూ.5 వేల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు చెప్పారు. పరారీలో ఉన్న శివకుమార్‌పై కూడా నేర నిర్ధారణ జరిగిందని, అతడిపై అరెస్టు వారెంట్ జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, బాధితురాలైన బాలికకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్‌కుమార్ సమర్థవంతంగా వాదనలు వినిపించారు.


