Navi Mumbai crime case: కొన్నిసార్లు చిన్నచిన్న విషయాలు సైతం భారీ గొడవలకు దారి తీస్తాయి. క్షణికావేశంలో దారుణాలకు పాల్పడేలా చేస్తాయి. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి అనూహ్య ఘటన ఒకటి జరిగింది. చికెన్ ముక్కల విషయంలో గొడవ జరగగా.. ఏకంగా భార్యను భర్త హత్య చేశాడు.
చికెన్ ముక్కల విషయంలో వివాదం: చికెన్ ముక్క విషయంలో జరిగిన గొడవ.. ఏకంగా ఓ ప్రాణాన్నే బలి తీసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబైలో చోటు చేసుకుంది. కమోథే ప్రాంతానికి చెందిన మనోహర్‌కు నాందేడ్ ప్రాంతానికి చెందిన పల్లవితో 2007లో వివాహం జరిగింది. పల్లవి గృహిణి కాగా.. మనోహర్ స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండేవాడు. అయితే అతను మద్యానికి బానిసై.. నిత్యం భార్యతో గొడవ పడేవాడు. కొన్ని రోజులకు మానసికంగా దెబ్బతిన్న వ్యక్తిలా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. 2019 డిసెంబరు 4న రాత్రి మనోహర్ తన విధులు ముగించుకుని.. సమీపంలోని షాప్‌లో చికెన్ కొని ఇంటికి తీసుకువెళ్లాడు. మార్గమధ్యంలోనే మద్యం సేవించిన అతడు .. ఇంటికి వెళ్లాక చికెన్‌ను భార్యకు అప్పగించి వండమని చెప్పాడు. అప్పటికే ఇద్దరు పిల్లల ఆలనాపాలనా చూస్తున్న ఆమె వంట చేయడం కాస్త ఆలస్యమైంది.
కిరోసిన్ పోసి: దీంతో ఆగ్రహానికి గురైన అతడు భార్యతో వాగ్వాదానికి దిగాడు. వంట పూర్తయిన తర్వాత భర్తకు భోజనం వడ్డించిన పల్లవి.. తన పిల్లల వద్దకు వెళ్లింది. అయితే తనకు వడ్డించిన కూరలో చికెన్ ముక్కలు తక్కువ ఉన్నాయని అతడు గొడవకు దిగాడు. పిల్లలతో కలిసి తినడానికి దాచుకున్నావా అంటూ మనోహర్ భార్యను దూషించడం స్టార్ట్ చేశాడు. ఆమె వారించడానికి ప్రయత్నించగా తను మరింతగా రెచ్చిపోయాడు. ఆగ్రహంతో భార్యపై దాడి చేశాడు. అనంతరం ఇంట్లో ఉన్న కిరోసిన్ తీసి భార్యపై పోసి నిప్పంటించాడు. దీంతో వారి పిల్లలు ఆర్తనాదాలు చేయగా .. ఎవరికైనా ఈ విషయం తెలుస్తుందేమోనని అక్కడి నుండి పరార్ అయ్యాడు. పల్లవి ఆర్తనాదాలు విన్న ఇంటిపక్కన ఉన్నవారు ఆమెను ముంబైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దాదాపు 50 శాతం కాలిన గాయాలైన ఆమె.. 3 రోజుల చికిత్స తర్వాత చనిపోయింది.
హైదరాబాద్‌లో అరెస్ట్: ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనోహర్ కోసం గాలించారు. నవీ ముంబై నుంచి పరారైన నిందితుడు మనోహర్ రెండేళ్ల పాటు వివిధ ప్రాంతాల్లో సంచరించాడు. అనంతరం 2021లో హైదరాబాద్ నగరానికి వచ్చి కాటేదాన్ ప్రాంతంలో ఓ గది అద్దెకు తీసుకున్నాడు. బతుకుతెరువు కోసం ఓ చిన్న కంపెనీలో రోజూవారి కూలీగా చేరాడు. సాంకేతిక ఆధారాలతో నవీ ముంబై పోలీసులు మనోహర్ ఆచూకీ కనిపెట్టారు. వెంటనే నగరానికి వచ్చి.. అతడు నివసిస్తున్న గదిపై దాడి చేసి అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.


