Family killed in bus accident : కంపెనీ ట్రిప్పులో భాగంగా సరదాగా హైదరాబాద్‌కు వెళ్లిన ఆ కుటుంబంలో, తిరిగి వచ్చేటప్పుడు తీరని విషాదం మిగిలింది. మార్గమధ్యంలో జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదం, ఆ కుటుంబాన్ని కబళించింది. భార్యాభర్తలు, ఇద్దరు చిన్నారులు నిద్రలోనే అగ్నికి ఆహుతై, సజీవ దహనమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన, నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో పెను విషాదాన్ని నింపింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆ నలుగురి ఆశలు ఎలా ఆవిరయ్యాయి..?
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు, కర్నూలు జిల్లా సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన వెంటనే, బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం అగ్నిగోళంగా మారడంతో, ప్రయాణికుల్లో అధిక శాతం గాఢ నిద్రలో ఉన్నారు. ఈ ఘోర దుర్ఘటనలో, 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
ఒకే కుటుంబంలో నలుగురు బలి :
ఈ మృతుల్లో, నెల్లూరు జిల్లా వింజమూరు మండలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
గోళ్ల రమేష్ (37)
భార్య అనూష (32)
కుమారులు మనీష్ (12), మణీత్వా (10)
రమేష్ గత 15 ఏళ్లుగా బెంగళూరులోని హిందుస్థాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, అక్కడే కుటుంబంతో స్థిరపడ్డారు.
వింజమూరులో విషాదఛాయలు : కంపెనీ స్పాన్సర్ చేసిన ట్రిప్పులో భాగంగా, రమేష్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడ సరదాగా గడిపి, తిరుగు ప్రయాణంలో ఈ ఘోర ప్రమాదానికి గురయ్యారు. ఒకే కుటుంబంలోని నలుగురూ మృత్యువాత పడ్డారన్న వార్త తెలియగానే, వారి స్వగ్రామమైన వింజమూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆనందంగా యాత్రకు వెళ్లిన వారు, ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో, వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సహాయక చర్యల కోసం తక్షణమే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.


