Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుNidigunta Aruna : కటకటాల్లోకి కిలాడీ అరుణ.. కత్తితో కకావికలం - కారు డిక్కీలో పలాయనం!

Nidigunta Aruna : కటకటాల్లోకి కిలాడీ అరుణ.. కత్తితో కకావికలం – కారు డిక్కీలో పలాయనం!

Nellore Lady Don’s criminal empire : వెలుగు కార్యాలయంలో ఓ సాధారణ ఉద్యోగిగా ప్రస్థానం మొదలుపెట్టి, కేవలం కొద్ది సంవత్సరాలలోనే నేర సామ్రాజ్యానికి మహారాణిగా, పోలీసు, రాజకీయ వ్యవస్థలను సైతం ప్రభావితం చేసే ‘లేడీ డాన్’గా పేరుగాంచిన నిడిగుంట అరుణ కథ క్లైమాక్స్‌కు చేరింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న రౌడీషీటర్ శ్రీకాంత్‌కు ప్రియురాలిగా, ఆయన పేరుతో అరాచకాలు, సెటిల్‌మెంట్లు నడిపినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె, చివరికి కారు డిక్కీలో దాక్కుని పారిపోతూ పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. ఒక సామాన్య మహిళ ఇంతటి నేర సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించగలిగింది.? ఆమె అరాచకాల వెనుక అదృశ్య హస్తాలు ఎవరివి.? ఈ ప్రశ్నల నడుమ ఆమె అరెస్టు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

- Advertisement -

అసలేం జరిగింది – బిల్డర్ ఫిర్యాదుతో బట్టబయలు : ఈ కేసు వివరాల్లోకి వెళితే, నెల్లూరుకు చెందిన బిల్డర్ మునగ వెంకట మురళీ కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదుతో అరుణ నేర చరిత్ర మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆయన కథనం ప్రకారం, 2022లో అరుణ ఆయన అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌ను రూ. 28 లక్షలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుని, కేవలం రూ. 3 లక్షలు అడ్వాన్సుగా చెల్లించింది. ఆ తర్వాత మిగిలిన సొమ్ము చెల్లించకపోగా, అద్దె కూడా కట్టడం మానేసింది. దీనిపై బిల్డర్ న్యాయపరంగా ముందుకు వెళ్లడంతో అరుణ తన నిజస్వరూపం బయటపెట్టింది.

2024లో తన అనుచరులైన పల్లం వేణు, అంకె రాజా, సీరం ఎలీషాలతో కలిసి బిల్డర్‌ను కిడ్నాప్ చేసి, ఆయన మెడపై కత్తి పెట్టి బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫ్లాట్‌ను తన పేరు మీద వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని, లేదంటే ప్రాణాలు దక్కవని తీవ్రంగా హెచ్చరించినట్లు బాధితుడు పోలీసులకు వివరించాడు. ఈ దారుణ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కోవూరు పోలీసులు అరుణ సహా నలుగురిపై క్రిమినల్ బెదిరింపులు, దోపిడీ, హత్యాయత్నం  సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పోలీసుల పక్కా వ్యూహం.. కారు డిక్కీలో నాటకీయ పలాయనం : కేసు తీవ్రతను గుర్తించిన నెల్లూరు ఎస్పీ జి. కృష్ణకాంత్, ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పోలీసుల వేట మొదలైందని గ్రహించిన అరుణ, విజయవాడ వైపు పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే, పక్కా సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు, ప్రకాశం జిల్లా అద్దంకి టోల్‌ప్లాజా వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును అడ్డగించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అరుణ కారు డిక్కీలో దాక్కున్నప్పటికీ, వారి నిశిత దృష్టి నుంచి తప్పించుకోలేకపోయింది. అరెస్టుకు ముందు ఆమె కారు డిక్కీలో నుంచే ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేసి, తనను అక్రమంగా ఇరికిస్తున్నారంటూ ఆరోపణలు చేయడం గమనార్హం.

‘వెలుగు’ ఉద్యోగి నుంచి లేడీ డాన్‌గా : ఒకప్పుడు ‘వెలుగు’ కార్యాలయంలో చిరుద్యోగిగా పనిచేసిన అరుణ, అనతికాలంలోనే లేడీ డాన్‌గా మారడం వెనుక రౌడీషీటర్ శ్రీకాంత్ పాత్ర కీలకమైనదిగా పోలీసులు భావిస్తున్నారు. నెల్లూరు జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్‌తో పరిచయం పెంచుకుని, అతని పేరును వాడుకుని అనేక సెటిల్‌మెంట్లు, దందాలు చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. ఇటీవల శ్రీకాంత్‌కు పెరోల్ ఇప్పించడంలో అరుణ కీలక పాత్ర పోషించిందని, ఆ సమయంలో ఆసుపత్రిలో వారిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోలు వైరల్ కావడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ వివాదం ముదరడంతో ప్రభుత్వం శ్రీకాంత్ పెరోల్‌ను రద్దు చేసింది.

రాజకీయ రంగు పులుముకున్న వివాదం : అరుణ అరెస్టు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ విషయంపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన 24 గంటల్లోనే అరుణ అరెస్ట్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అరుణ తమ పార్టీ కార్యకర్తేనని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తుండగా, ఆమెకు గత వైఎస్సార్‌సీపీ నేతలతోనే సంబంధాలున్నాయని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రత్యారోపణలు చేశారు. దీంతో ఈ కేసు దర్యాప్తులో మరిన్ని రాజకీయ సంబంధాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కటకటాల వెనక్కి : అరెస్టు చేసిన అరుణను, ఆమె ముగ్గురు అనుచరులను కోవూరు పోలీసులు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అరుణను కావలి జైలుకు, మిగతా ముగ్గురిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగితే, అరుణ నేర సామ్రాజ్యంలో భాగస్వాములైన మరికొంతమంది ప్రముఖుల పేర్లు బయటకు రావడం ఖాయమని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad