Marriage party: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోటి ఆశలతో కాపురాన్ని ప్రారంభించిన నూతన వధువరుల దాంపత్యంలో తీరని దుఃఖం అలుముకుంది. అతిగా మద్యం సేవించిన కొత్త పెళ్లి కొడుకు కాలు జారీ మృతి చెందాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బాత్రూంలో కాలుజారి మృతి: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అపోజిగూడలో గల లోటస్ బ్లిస్ ఫామ్‌హౌస్‌లో పెళ్లి పార్టీ సందర్భంగా జరిగిన విషాద ఘటనలో చోటుచేసుకుంది. నూతన వరుడు మద్యం మత్తులో మృతి చెందాడు. పంజాగుట్టలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన వెంకట కిషోర్ రెడ్డికి నాలుగు నెలల క్రితం ఉషారాణి అనే మహిళతో వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా స్నేహితులు పార్టీ అడగడంతో.. శనివారం రాత్రి మొయినాబాద్‌లోని లోటస్ బ్లిస్ ఫామ్‌హౌస్‌లో స్నేహితుల కోసం పార్టీ ఏర్పాటు చేశాడు. అయితే ఈ పార్టీకి వెళ్లే ముందు భార్యకు.. చెప్పిమరీ వెళ్లాడు. పార్టీలో వెంకట కిషోర్ రెడ్డి అతిగా మద్యం సేవించాడు. ఈ క్రమంలోనే ఫామ్‌హౌస్‌లోని బాత్రూంలో ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయాడు. అతని స్నేహితులు వెంటనే గమనించి గండిపేట్‌లోని ప్రైవేట్ ఫ్రీడమ్ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 4:20 గంటలకు వెంకట కిషోర్ రెడ్డిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
Also Read:https://teluguprabha.net/top-stories/young-woman-suicide-after-love-failed-in-siddipet-district/
కన్నీరు మున్నీరుగా విలపించిన నూతన వధువు: ఆదివారం ఉదయం కిషోర్ రెడ్డి భార్య ఉషారాణి తన భర్తకు ఫోన్ చేయగా స్నేహితుడు భవాని శంకర్ లిఫ్ట్ చేసి హాస్పిటల్‌లో ఉన్నట్లు తెలిపాడు. వెంటనే ఆసుపత్రికి చేరుకున్న ఉషారాణి, తన భర్త మరణవార్త విని కుప్పకూలిపోయింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఈ ఘటనపై మృతుడి భార్య ఉషారాణి ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అతిగా మద్యం సేవించడం, ఆపై కాలుజారి పడిపోవడం మరణానికి కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు.

