Road Accident Newly Married woman died: రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… ఈ తరహా ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృతి చెందారు. వీరిలో ఓ నవవధువు.. పెళ్లైన మూడు రోజులకే రోడ్డు ప్రమాదానికి గురవ్వడం బాధకరమైన విషయం.
పీజీ సెట్ రాసి వస్తుండగా…
కాళ్ల పారాణి ఆరక ముందే నవ వధువు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఉన్నత చదువులు కొనసాగించాలన్న ఆకాంక్షతో పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ రాసి వస్తానని నవవధువు కోరగా.. భర్తే స్వయంగా తనను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాడు. పరీక్ష ముగించుకుని వస్తే పదహారు రోజుల పండగ చేద్దామని కుటుంబసభ్యులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా… లారీ రూపంలో మృత్యువు నవవధువును బలి తీసుకుంది. కరీంనగర్ సమీపంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని అఖిల(22)కు, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం లొత్తునూర్ గ్రామానికి చెందిన రాజుతో ఈ నెల 6న పెళ్లి జరిగింది. ఇటీవల డిగ్రీ పూర్తి చేసిన అఖిల.. శుక్రవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని కళాశాలలో పీజీ సెట్ ఎంట్రెన్స్ రాసేందుకు… భర్త రాజుతో కలిసి వెళ్లింది. అయితే పరీక్ష రాసి తిరిగి వెళ్తుండగా, మహాత్మానగర్ స్టేజీ సమీపంలో వేగంగా వచ్చిన లారీ బైక్ ను ఢీ కొట్టింది. దీంతో అఖిల అక్కడికక్కడే చనిపోగా, రాజుకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/crime-news/tribal-welfare-enc-c-srinivas-nabbed-by-acb-at-vijayawada/
తిరుమల దర్శనానికి వెళ్తుండగా…
ప్రకాశం జిల్లా చాకిచెర్ల వద్ద మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల నుంచి తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాన్‌ను లారీ ఢీకొనడంతో.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మెరుగైన వైద్యం కోసం వీరిని నెల్లూరుకు తరలించారు.
రాయి.. కారును ఢీ కొని…
హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలోనూ మరో ఘోరు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. రాజేష్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కారులో వెళ్తుండగా కొండప్రాంతం నుంచి పడిన ఓ రాయి.. కారును బలంగా ఢీ కొట్టింది. దీంతో అదుపుతప్పిన కారు భారీ లోయలో పడింది.


