Nikki Bhati : గ్రేటర్ నోయిడాలో నిక్కీ భాటి (28) హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె మృతికి గ్యాస్ సిలిండర్ పేలుడే కారణమన్న వాదనను పోలీసులు కొట్టిపారేశారు. ఈ ఘటన పక్కా ప్రణాళికతో జరిగిన వరకట్న హత్య అని నిర్ధారించారు. సిర్సా గ్రామంలోని ఆమె ఇంట్లో ఈ నెల 21న నిక్కీ కాలిన గాయాలతో మృతి చెందింది.
ALSO READ: Harish Rao: మెదక్ జిల్లాలో హరీష్ రావు పర్యటన: ‘ప్రభుత్వం వల్లే ఇద్దరు మృతి’
పోలీసులు ఘటనా స్థలంలో ఖాళీ థిన్నర్ డబ్బా, లైటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపబడ్డాయి. నిక్కీ సోదరి కంచన్, ఆమె మంటల్లో ఉండగా తీసిన వీడియో ఈ కేసులో కీలక ఆధారంగా మారింది. కంచన్ ఫిర్యాదు మేరకు నిక్కీ భర్త విపిన్ భాటి, అతని తల్లి దయ, తండ్రి సత్వీర్, సోదరుడు రోహిత్‌లను అరెస్టు చేశారు.
ఆసుపత్రి రికార్డుల్లో నిక్కీ సిలిండర్ పేలుడు కారణంగా గాయాలపాలైనట్లు నమోదైంది. అయితే, పోలీసులు వంటగదిని పరిశీలించగా ఎలాంటి పేలుడు ఆనవాళ్లు లభించలేదు. కాస్నా ఎస్‌హెచ్‌వో ధర్మేంద్ర శుక్లా మాట్లాడుతూ, నిక్కీ తన సోదరి కంచన్ భవిష్యత్తు కోసం అత్తవారిని రక్షించేందుకు అబద్ధం చెప్పి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కంచన్ కూడా విపిన్ సోదరుడు రోహిత్‌ను వివాహం చేసుకుంది.
2016లో వివాహమైన నిక్కీ, వరకట్నం కోసం స్కార్పియో కారు, బైక్ ఇచ్చినప్పటికీ, రూ.36 లక్షలు, లగ్జరీ కారు డిమాండ్ చేసి వేధించారని ఆమె కుటుంబం ఆరోపించింది. నిక్కీ, కంచన్‌లు కలిసి బ్యూటీ పార్లర్ నడుపుతూ సోషల్ మీడియాలో రీల్స్ చేయడం విపిన్ కుటుంబానికి నచ్చలేదని తెలుస్తోంది. ఈ వివాదం హత్యకు దారితీసినట్లు పోలీసులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో “జస్టిస్ ఫర్ నిక్కీ” క్యాంపెయిన్ ఊపందుకుంది.


