Nurse Dies By Suicide After Blackmail: కూతురు స్నేహితురాలినే వేధించాడు ఓ కీచకుడు. ఆమె ప్రైవేట్ ఫొటోతో బ్లాక్‌మెయిల్ చేశాడు. తనను మాత్రమే కలవాలని, పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు. దీంతో ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఈ విషాద ఘటన బెంగళూరులో జరిగింది.
వివరాల్లోకి వెలితే..
బెంగళూరు శివార్లలోని నెలకుండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక నర్సు ఆత్మహత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. తన స్నేహితురాలి తండ్రి బ్లాక్‌మెయిల్, వేధింపులు భరించలేకనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తుమకూరు జిల్లా గుబ్బి పట్టణంలోని గ్యారహళ్లి నివాసి అయిన 22 ఏళ్ల భావన, నెలకుండలోని తన అత్త ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత శుక్రవారం ఆమె అత్తగారింటికి వచ్చింది. ఈ విషాదానికి కారణం, ఆమె క్లాస్‌మేట్ తండ్రి అయిన నవీన్ అనే వ్యక్తి చేసిన బ్లాక్‌మెయిల్, వేధింపులేనని పోలీసులు గుర్తించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే…
భావన మైసూరులో నర్సింగ్ చదువుతున్న సమయంలో, నవీన్ తన కుమార్తె బ్యాంక్ ఖాతాకు భావన మొబైల్ ద్వారా డబ్బు పంపేవాడు. అలా నవీన్, తన కుమార్తె ఫోన్ నుండి భావన నంబర్‌ను తీసుకుని ఆమెను సంప్రదించడం మొదలుపెట్టాడు.
చదువు పూర్తయిన తర్వాత భావన తుమకూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేయడం ప్రారంభించింది. అప్పటికి కూడా నవీన్ ఆమెతో సంబంధాలు కొనసాగించాడు. ఒకసారి ఆమెను ధర్మస్థలానికి తీసుకెళ్లి, అక్కడ ఆమెతో దిగిన ఒక ప్రైవేట్ ఫోటోను చూపిస్తూ, తనను పెళ్లి చేసుకోవాలని, మరెవరినీ వివాహం చేసుకోకూడదని తీవ్రంగా బెదిరించడం, ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. మాట వినకపోతే ఆ ఫోటోను వైరల్ చేస్తానని నవీన్ హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు.
ఇంతకుముందూ ఆత్మహత్యాయత్నం..
ఈ వేధింపులు భరించలేక భావన సుమారు 15 రోజుల క్రితం కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ సంఘటన తర్వాత ఆమె తండ్రి నవీన్‌పై చేలూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పుడు ఆసుపత్రిలో చేరిన భావన కోలుకుంది. పోలీసులు నవీన్‌కు హెచ్చరిక జారీ చేసి, భావనకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. బ్లాక్‌మెయిల్ వేధింపులు కొనసాగడంతో చివరకు భావన ప్రాణాలు తీసుకుంది.


