Homeనేరాలు-ఘోరాలుPalvancha: జర్నలిస్ట్‌పై హత్యాయత్నం.. ఛేదించిన పాల్వంచ పోలీసులు

Palvancha: జర్నలిస్ట్‌పై హత్యాయత్నం.. ఛేదించిన పాల్వంచ పోలీసులు

పాల్వంచ(తెలుగు ప్రభ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో సెప్టెంబర్ 7న జర్నలిస్ట్ మనుపూరి ప్రభాకర్‌పై జరిగిన దాడి ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దాడి వెనుక భారీ సుపారీ కుట్ర దాగి ఉందని తేల్చిన పాల్వంచ టౌన్ పోలీసులు, శనివారం నాడు ఈ కేసును అధికారికంగా ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తును వేగవంతం చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 07న రాత్రి సుమారు 08:30 గంటల సమయంలో పాల్వంచలోని కనకదుర్గ బార్ నుండి బయటకు వస్తున్న ఎన్.హెచ్-9 ఎలక్ట్రానిక్ మీడియా చైర్మన్, జర్నలిస్ట్ మనుపూరి ప్రభాకర్ (54)పై ముగ్గురు వ్యక్తులు సోడా బాటిల్‌తో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్.ఐ.ఆర్ నెం. 345/2026 కింద BNS సెక్షన్లు 296(b), 118(1), 351(2) r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

ఆర్థిక లావాదేవీలే దాడికి కారణం..
పోలీసులు కాల్ డేటా రికార్డులు (సీడీఆర్), సీసీటీవీ ఫుటేజ్ మరియు ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించగా ఈ దాడి వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు వెల్లడైంది. పాల నాగేశ్వరరావు అనే వ్యక్తి ప్రభాకర్ వద్ద గతంలో రూ.40 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని ప్రభాకర్ ఒత్తిడి చేయడంతో, ఆయనను అడ్డు తొలగించుకోవాలని నాగేశ్వరరావు పథకం పేశాడు. కొత్తగూడెం పెట్రోల్ బంక్ పంప్ ఆపరేటర్ దాసరి రాజు ద్వారా, కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ ఉన్న అరవ వినయ్ కుమార్‌ను నిందితుడు సంప్రదించాడు. ప్రభాకర్‌ను హతమార్చేందుకు రూ.5 లక్షలకు సుపారీ ఒప్పందం కుదుర్చుకుని, ముందస్తుగా రూ.2 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించారు.

పక్కా పథకంతో దాడి..
ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం నాగేశ్వరరావు, ప్రభాకర్‌తో కలిసి బార్‌లో మద్యం సేవించాడు. సాయంత్రం బయటకు వచ్చిన తర్వాత ప్రభాకర్ కదలికలపై నిరంతరం ఆరా తీస్తూ.. ఆ సమాచారాన్ని దాసరి రాజు ద్వారా వినయ్ కుమార్‌కు చేరవేశాడు. పక్కా సమాచారంతో వినయ్ కుమార్ తన అనుచరులతో కలిసి బార్ వద్ద కాపుకాసి ప్రభాకర్‌పై ఈ దురాఘాతానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు మరియు సాంకేతిక ఆధారాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, పట్టుబడిన నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జర్నలిస్టులపై జరిగే ఇటువంటి దాడులను ఉపేక్షించేది లేదని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.

నిందితుల వివరాలు..

  • అరవ వినయ్ కుమార్
  • ఎలగడ శివకృష్ణ
  • దాకూరి గణేష్
  • దాసరి రాజు
  • పాల నాగేశ్వరరావు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News