Pan-India loan scam arrest: సినిమాలను తలపించేలా.. విలాసవంతమైన భవనంలో రహస్య గది.. అందులో దాక్కున్న కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు! పోలీసులకే చుక్కలు చూపించి, దేశవ్యాప్తంగా వ్యాపారవేత్తలకు వల వేసిన ఘరానా మోసగాడి ఆట కట్టయ్యింది. పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పిస్తానని నమ్మించి, ఏకంగా రూ.32 కోట్లు కొల్లగొట్టిన ఓ ప్రబుద్ధుడిని, అతని విలాసవంతమైన ఇంట్లోనే ఓ రహస్య భూగర్భ గదిలో మంగళూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అసలు ఈ కేటుగాడు మోసం చేసింది ఎలా? పోలీసులు ఆ రహస్య గదిని ఎలా కనిపెట్టారు..? అక్కడ దొరికిన సొమ్ము చూసి అధికారులు ఎందుకు విస్తుపోయారు..?
పక్కా సమాచారంతో పక్కా ప్లాన్ : కర్ణాటకలోని మంగళూరు, జెప్పినమొగరు ప్రాంతానికి చెందిన రోషన్ సల్దాన్హా అనే వ్యక్తిపై దేశవ్యాప్తంగా పలువురు వ్యాపారవేత్తలను మోసం చేశాడన్న ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. పెద్ద మొత్తంలో వ్యాపార రుణాలు ఇప్పిస్తానని నమ్మించి, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి, ఆపై ముఖం చాటేశాడని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, రోషన్ సల్దాన్హా తన విలాసవంతమైన ఇంట్లోనే ఓ రహస్య బేస్‌మెంట్‌లో దాక్కున్నాడన్న విశ్వసనీయ సమాచారంతో దాడికి సిద్ధమయ్యారు.
వార్డ్‌రోబ్ వెనుక రహస్య మార్గం.. పోలీసులకే మైండ్‌బ్లాక్ : సమాచారం మేరకు పోలీసులు సల్దాన్హా ఇంటిపై దాడి చేశారు. మొదట ఇల్లంతా జల్లెడ పట్టినా నిందితుడి ఆచూకీ లభించలేదు. అయితే, ఓ గదిలోని వార్డ్‌రోబ్ వెనుక పోలీసులు చాకచక్యంగా ఏర్పాటు చేసిన ఓ రహస్య ద్వారాన్ని గుర్తించారు. ఆ మార్గం గుండా ఓ భూగర్భ గదిలోకి ప్రవేశించగా, అక్కడ మరో రహస్య గది కనిపించింది. అందులో దాక్కున్న రోషన్ సల్దాన్హాను ఎట్టకేలకు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
బయటపడ్డ గుప్త నిధులు: రహస్య గదులలో సోదాలు చేపట్టిన పోలీసులకు కళ్లు బైర్లు కమ్మేంత సొమ్ము లభించింది. అనుమతి లేకుండా నిల్వ ఉంచిన రూ.6.72 లక్షల విలువైన విదేశీ, దేశీయ బ్రాండ్ల మద్యం.మోసాలకు సంబంధించిన కీలక పత్రాలు, బాధితుల నుంచి తీసుకున్న ఖాళీ చెక్కులు.సుమారు 667 గ్రాముల బంగారు ఆభరణాలు.దాదాపు రూ.2.75 కోట్ల విలువైన వజ్రాల ఉంగరాలు. వీటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దేశవ్యాప్తంగా మోసాల నెట్‌వర్క్: నగర పోలీస్ కమిషనర్ సుధీర్ కుమార్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, సల్దాన్హా కేవలం కర్ణాటకలోనే కాకుండా ముంబయి, గోవా, బెంగళూరు, పుణె, విజయపుర, కోల్‌కతా, లఖ్‌నవూ వంటి అనేక ప్రధాన నగరాలకు చెందిన వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకున్నాడు. భారీ రుణాలు ఇస్తానని ఆశ చూపి, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో గత మూడు నెలల్లోనే బాధితుల నుంచి రూ.32 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నామని, ఈ కుంభకోణంలో అతనికి సహకరించిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని కమిషనర్ తెలిపారు.


