Parents Protest at Medha School: బోయిన్‌పల్లిలోని మేధా స్కూల్‌లో డ్రగ్స్ తయారీ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది. పాఠశాల తరగతి గదినే డ్రగ్స్ ఫ్యాక్టరీని తలపించేలా రియాక్టర్లు ఏర్పాటు చేసి జయప్రకాశ్ గౌడ్ అనే వ్యక్తి డ్రగ్స్ తయారు చేశాడు. దీంతో ఈగల్ టీం పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేసి డ్రగ్స్ గుట్టును రట్టు చేశారు. ఈ ఘటన తర్వాత పాఠశాలను అధికారులు సీజ్ చేశారు. దీంతో అందులో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
తల్లిదండ్రుల ఆందోళన: సోమవారం విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయని పాఠశాల యాజమాన్యం మెసేజ్ పంపడంతో.. విద్యార్థులతో పాటుగా తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లలకు న్యాయం చేయాలని విద్యాశాఖను డిమాండ్ చేశారు.
Also Read: https://teluguprabha.net/crime-news/husband-dies-after-wife-passes-away-in-jagitial-district/
అధికారుల హామీ: తల్లిదండ్రుల ఆందోళనతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. మేధా స్కూల్‌లో చదువుతున్న విద్యార్థుల వివరాలను సేకరించారు. వారిని ఇతర పాఠశాలలకు బదిలీ చేయడంపై చర్చలు తీసుకుంటామని అన్నారు. విద్యార్థులకు సరైన స్కూల్‌లో చేర్పించి వారి భవిష్యత్తును కాపాడతామని.. ఎంఈఓ హరిచందన్ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
డ్రగ్స్ గుట్టును రట్టు చేసిన ఈగల్ టీం: సికింద్రాబాద్‌లోని పాత బోయిన్‌పల్లిలో గల మేధా ప్రైవేట్ పాఠశాలలో అక్రమంగా డ్రగ్స్ తయారు చేస్తున్న కేంద్రం వెలుగులోకి వచ్చింది. ఒకవైపు పాఠశాలను నడుపుతూనే.. అదే భవనంలోని రెండో అంతస్తులో అల్ఫ్రాజోలం అనే మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో ఈగల్ బృందం పోలీసులు మేధా ప్రైవేట్ పాఠశాలపై దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో పాఠశాల నిర్వాహకుడు జయప్రకాష్ గౌడ్ డ్రగ్స్ తయారీ యంత్రాలను ఏర్పాటు చేసి ఈ అక్రమ దందా నడిపిస్తున్నట్లు తేలింది.
Also Read:https://teluguprabha.net/crime-news/father-confesses-to-murdering-his-2-year-old-son/
పోలీసుల చర్యలు: దాడుల సందర్భంగా పోలీసులు రూ. 20 లక్షల నగదుతో పాటుగా కోటి రూపాయల విలువైన 7 కిలోల అల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈగల్ బృందం ప్రస్తుతం ఇతర మత్తు పదార్థాలు కూడా తయారు చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనతో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాఠశాల నిర్వాహకుడే ఇలాంటి అక్రమాలకు పాల్పడటం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.


