Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుBank Manager: ఫంక్షన్‌కు వెళ్లిన మేనేజర్.. 36 గంటల తర్వాత బావిలో శవమై!

Bank Manager: ఫంక్షన్‌కు వెళ్లిన మేనేజర్.. 36 గంటల తర్వాత బావిలో శవమై!

Patna Bank Manager Death: కుటుంబంతో కలిసి శుభకార్యానికి వెళ్లిన ఓ బ్యాంకు మేనేజర్, 36 గంటల తర్వాత బావిలో శవమై తేలడం పట్నాలో తీవ్ర కలకలం రేపింది. “నాకు యాక్సిడెంట్ అయింది” అంటూ అర్థరాత్రి భార్యకు చేసిన ఆ ఒక్క ఫోన్ కాల్ తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆ తర్వాత ఏం జరిగింది? మద్యం మత్తులో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడా? లేక దీని వెనుక మరేదైనా కుట్ర కోణం దాగి ఉందా? ఈ మిస్టరీ మరణంపై పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసిన సంచలన విషయాలేంటి?

- Advertisement -

అసలేం జరిగింది..?
పట్నాలోని కంకర్‌బాగ్‌లో ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న అభిషేక్ వరుణ్, జూలై 13వ తేదీ రాత్రి రామకృష్ణ నగర్ ప్రాంతంలో జరిగిన ఒక ఫంక్షన్‌కు తన భార్యాపిల్లలతో కలిసి వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో భార్య, పిల్లలు ఇంటికి తిరిగి రాగా, వరుణ్ మాత్రం అక్కడే ఉండిపోయారు.

అర్థరాత్రి ఫోన్ కాల్.. ఆపై అదృశ్యం : తెల్లవారుజామున సుమారు 1 గంట ప్రాంతంలో, వరుణ్ తన భార్యకు ఫోన్ చేసి, తనకు ప్రమాదం జరిగిందని చెప్పాడు. అయితే, ఎక్కడ ప్రమాదం జరిగింది, ఎలా జరిగింది అనే వివరాలు చెప్పేలోపే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆయన భార్య, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది : వరుణ్ భార్య ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, ఫంక్షన్ హాల్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. రాత్రి 10:48 గంటలకు వరుణ్ ఒంటరిగా తన స్కూటర్‌పై వెళ్తున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతని కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

36 గంటల తర్వాత బావిలో : వరుణ్ అదృశ్యమైన సుమారు 36 గంటల తర్వాత, పట్నాలోని బియుర్ ప్రాంతంలో ఉన్న ఒక పాడుబడిన బావిలో స్కూటర్‌తో పాటు ఓ మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్రేన్ సహాయంతో స్కూటర్‌ను, మృతదేహాన్ని బయటకు తీశారు. అది కనిపించకుండా పోయిన బ్యాంక్ మేనేజర్ వరుణ్‌దేనని నిర్ధారించారు. సమీపంలోనే అతని చెప్పులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఆత్మహత్యా? లేదా ఎవరైనా హత్య చేసి బావిలో పడేశారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి గల కచ్చితమైన కారణం తెలుస్తుందని ఫుల్వారీ షరీఫ్ డీఎస్పీ తెలిపారు. ఆ ఒక్క ఫోన్ కాల్ ఈ మిస్టరీని ఛేదించడంలో కీలకం కానుందని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad