Vikarabad crime: వికారాబాద్ జిల్లాలోని కులకచర్ల మండలంలో అత్యంత హేయమైనఘటన చోటుచేసుకుంది. వేపూరి యాదయ్య అనే వ్యక్తి కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన బిడ్డను కత్తితో విచక్షణారహితంగా నరికి చంపాడు. అంతే కాకుండా కన్నతల్లి లాంటి వదినను సైతం కత్తితో దారుణంగా నరికి చంపాడు. అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదు ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. నలుగురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రాథమికంగా తెలిసిన వివరాల ప్రకారం: యాదయ్య, అలవేలు భార్యాభర్తలు. వారికి అపర్ణ, శ్రావణి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రోజువారీ కూలీగా పనిచేసే యాదయ్యకు భార్య అలవేలుపై అనుమానం ఎక్కువగా ఉండేదని కుటుంబ సభ్యులు, స్థానికుల ద్వారా తెలుస్తొంది. భార్యపై అనుమానంతో ప్రతీరోజు గొడవ పడేవాడని చుట్టుపక్కల వారు తెలిపారు . ఈ క్రమంలోనే గతకొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. భార్యను యాదయ్య తీవ్రంగా కొట్టినట్టు కూడా తెలిసింది. దీంతో.. ఇద్దరిని రాజీ చేసేందుకు వదిన హన్మమ్మ వారి ఇంటికి వచ్చిందని తెలుస్తోంది.
శనివారం రాత్రి వారి మధ్య తీవ్రంగా చర్చలు జరిగాయి. ఆ తరువాత అందరూ పడుకున్న సమయంలో అర్ధరాత్రి యాదయ్య ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది. భార్య అలవేలు (32), కూతురు శ్రావణి (13), వదిన హన్మమ్మ (40)ను కోడవలితో గొంతుకోసి హత్య చేశాడు. పెద్దకుమార్తె అపర్ణపై సైతం దాడి చేయబోగా ఆమె తప్పించుకొని పారిపోయిందని తెలుస్తోంది. అపర్ణ ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పడంతో.. వారు వచ్చేలోపే యాదయ్య ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.


