Police Harassment on victim: ప్రజలను కాపాడాల్సిన పోలీసులే నిందితులుగా మారిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. ఓ మహిళపై కానిస్టేబుల్ లైంగికదాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. అయితే ఇది ఎక్కడ జరిగింది. ఎందుకు అలా చేశారో తెలుసుకుందాం.
చిత్తూరు జిల్లాలో కలకలం: మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది. పలమనేరు పట్టణంలోని గంటావూరు కాలనీకి చెందిన ఓ మహిళపై కానిస్టేబుల్ లైంగికదాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడిన కానిస్టేబుల్, హోంగార్డు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. వారి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే: చిత్తూరు జిల్లాలోని గంటావూరుకు చెందిన ఓ మహిళకు ముగ్గురు పిల్లలున్నారు. ఆమె భర్త ఇటీవల వేధింపులతో.. నాలుగు నెలల క్రితం పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. బాధితురాలు అందంగా ఉండడంతో స్థానిక సీఐ డ్రైవర్‌గా పనిచేస్తున్న హోంగార్డు కిరణ్‌కుమార్.. ఆమెపై కన్నశాడు. బాధితురాలి ఫిర్యాదులోని ఫోన్ నంబరును తీసుకుని తాను న్యాయం చేస్తానంటూ బాధితురాలికి రాత్రుల్లో ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. దీంతో బాధితురాలు తనకు తెలిసిన వారి ద్వారా పలమనేరులో పనిచేసే మరో హోంగార్డుకు తన బాధను వెల్లడించింది. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ కానిస్టేబుల్ కూడా నేరుగా బాధితురాలి ఇంటికెళ్లి ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటానంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆపై అతడు కూడా రాత్రుల్లో ఫోన్‌లు చేయడం స్టార్ట్ చేశాడు. దీంతో బాధితురాలిచ్చిన ఫిర్యాదు దేవుడెరుగు. ఇప్పుడు ఆ ఇద్దరి వేధింపులతో ఏం చేయలేని పరిస్థితిలో బాధితురాలు తీవ్రంగా మనోవేదన అనుభవించింది. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఆ బాధితురాలిది.
ఎస్పీని కలిసిన జరగని న్యాయం: ఆ ఇద్దరి వేధింపులతో ఇక చేసేది ఏం లేక.. తనకు జరిగిన అన్యాయంపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. ఆయన వెంటనే దీనిపై విచారణ చేయాలని పలమనేరు సీఐ మురళీమోహన్‌కు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఘటన జరిగింది తన పరిధి కాదని బంగారుపాళెం సీఐని కలవాలని ఆమెకు సూచించారు. వెంటనే బాధితురాలు బంగారుపాళెం సీఐని కలిసింది. ఆ కానిస్టేబుల్‌కు అధికార పార్టీ అండదండలు ఉండడం, నిందితుడు పోలీసు కావడంతో అప్పట్లో ఎఫ్‌ఐఆర్ వేయకుండా కాలయాపన జరిగింది. ఎస్పీని కలిసినా న్యాయం జరగలేదని ఆవేదన చెందిన బాధితురాలు.. బుధవారం చిత్తూరులో ప్రెస్‌మీట్ పెట్టి తనకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు వివరించింది. విషయం మీడియాకు చేరడంతో వెంటనే స్పందించిన పోలీసులు బుధవారమే సదరు పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు వేశారు. కానిస్టేబుల్, హోంగార్డు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


