Sangareddy accident: సంగారెడ్డి జిల్లా మానూర్ పోలీసు స్టేషన్ సమీపంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఏఎస్‌ఐ (ASI) గోవింద్ నాయక్‌పైకి పోలీసు వాహనం దూసుకెళ్లింది. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో పోలీసు వాహన డ్రైవర్ హోంగార్డు పరారీ అయ్యాడు. హోంగార్డు కక్షపూరితంగానే ఈ ప్రమాదం చేశాడని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మంగళవారం ఉదయం మానూర్ పోలీస్ స్టేషన్ ముందు ఏఎస్‌ఐ గోవింద్ నాయక్ విధి నిర్వహణలో ఉండగా.. ఒక్కసారిగా పోలీసు వాహనం ఆయనపైకి దూసుకువచ్చింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది గోవింద్ నాయక్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో గోవింద్ నాయక్ తుదిశ్వాస విడిచారు.
పరారీలో హోంగార్డు రామారావు: ప్రమాదం జరిగిన వెంటనే వాహనం నడుపుతున్న హోంగార్డు రామారావు అక్కడి నుండి పరారయ్యాడు. దీంతో ఇది కేవలం ప్రమాదం కాదని.. హోంగార్డు కక్షపూరితంగానే ఏఎస్‌ఐపైకి వాహనాన్ని ఎక్కించాడని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలే ఈ దారుణానికి కారణమని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు.. పరారీలో ఉన్న హోంగార్డు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

